కథ విన్నప్పుడే చాలా థ్రిల్ అయ్యా.. ఈ సారి పక్కా హిట్ కొడతా
ఈ సారి పక్కా హిట్ కొడతా

యంగ్ హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘శంబాల’ రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది.మీడియాతో మాట్లాడిన ఆది "మీకు తెలిసిన శాస్త్రం మితం.. మా శాస్త్రం అనంతం" అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఇందులో ఆది జియో సైంటిస్ట్ (భౌగోళిక శాస్త్రవేత్త) గా కనిపించనున్నారు. ఒక ఊరిపై పడిన ఉల్క వల్ల ప్రజల ప్రవర్తనలో వచ్చే మార్పులు, దాని వెనుక ఉన్న రహస్యాన్ని హీరో ఎలా ఛేదించాడనేది కథ. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి విభిన్నమైన సబ్జెక్ట్ చేయలేదని, ఈ కథ విన్నప్పుడే చాలా థ్రిల్ అయ్యానని ఆది పేర్కొన్నారు. ముఖ్యంగా 1980 నేపథ్యంలో సాగే కథ కావడంతో లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.
సినిమాలో వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
క్రిస్మస్ బరిలో మరికొన్ని సినిమాలు ఉన్నప్పటికీ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆది చెప్పారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా, త్వరలో హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా 'శంబాల 2' కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన తల్లి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడంపై స్పందిస్తూ.. ఆవిడ అంతలా మాట్లాడతారని తాను కూడా ఊహించలేదని, అది తనపై ఉన్న ప్రేమతో అన్న మాటలని భావోద్వేగానికి లోనయ్యారు.ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

