Govinda Affair Row: గోవిందా అఫైర్‌పై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!
సునీత సంచలన వ్యాఖ్యలు!

Govinda Affair Row: బాలీవుడ్ మాజీ స్టార్ హీరో, 'నెంబర్ వన్' సిరీస్ చిత్రాల ఫేమ్ గోవిందా వైవాహిక జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా గోవిందా వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా ఎట్టకేలకు నోరు విప్పారు. గోవిందాకు ఒక అమ్మాయితో అఫైర్ ఉన్న మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరిస్తూనే, ఆ మహిళపై సునీత తీవ్ర విమర్శలు చేశారు.
ఇటీవల ఒక మీడియా సంస్థకు (ETimes) ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. 2025 సంవత్సరం తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఏడాది అని ఆవేదన వ్యక్తం చేశారు. "గోవిందా ఒక అమ్మాయితో అఫైర్ నడుపుతున్నాడని గత ఏడాది కాలంగా వింటున్నాను. ఆమెకు నా భర్త మీద ఎలాంటి ప్రేమ లేదు, కేవలం ఆయన డబ్బు కోసమే తనతో ఉంటోంది. ఆమె ఒక నటి మాత్రం కాదు, ఎందుకంటే నటీమణులు ఇంత నీచంగా ప్రవర్తించరు" అని సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గోవిందా జీవితంలో ముగ్గురు మహిళలు అత్యంత ముఖ్యమని.. వారు ఆయన తల్లి, భార్య (సునీత), కుమార్తె (టీనా) అని ఆమె పేర్కొన్నారు. "ఈ ముగ్గురు కాకుండా గోవిందాతో సహా ఏ పురుషుడి జీవితంలోనూ నాలుగో మహిళకు చోటు ఉండకూడదు. గోవిందా చుట్టూ ఉండే కొందరు 'చమ్చాలు' కూడా ఆయన దగ్గర డబ్బు గుంజుకోవడానికే ఉన్నారు తప్ప ఆయన క్షేమం కోరేవారు కాదు. ఆయన ఇకనైనా వారందరినీ వదిలేసి తన పనిపై దృష్టి పెట్టాలి" అని ఆమె సూచించారు.
తమ మధ్య విభేదాలు ఉన్నాయని, విడాకులు తీసుకుంటున్నారనే వార్తలను గతంలో సునీత ఖండించారు. అయితే ఇప్పుడు ఏకంగా అఫైర్ గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. 2026లో తన కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉండాలని, ఈ వివాదాలన్నీ సమసిపోవాలని కోరుకుంటున్నట్లు సునీత తెలిపారు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్న సునీత, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1987లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

