Ghattamaneni Family Heir: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న మొదటి సినిమా “శ్రీనివాస మంగాపురం”. ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతుండటం విశేషం. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

టీజర్ విషయానికి వస్తే, దర్శకుడు అజయ్ భూపతి తన మార్కును మరోసారి చాటుకున్నారు. ఒక అందమైన ప్రేమకథగా మొదలై, అకస్మాత్తుగా అది తీవ్రమైన యాక్షన్ కథగా మారే క్రమాన్ని టీజర్‌లో అద్భుతంగా చూపించారు. జయకృష్ణ తన మొదటి సినిమానే అయినా నటనలో, యాక్షన్ సీన్స్‌లో చాలా పరిణితి చూపించగా, రాషా తడాని తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్. అటు రొమాంటిక్ సీన్స్‌లోనూ, ఇటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. విజువల్స్ కూడా చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. ఘట్టమనేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వారసుడి ఎంట్రీ టీజర్‌తోనే పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. కథలో ఉన్న గాఢత, నటీనటుల ప్రతిభ చూస్తుంటే అజయ్ భూపతి మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story