Grandmaster Praggnanandhaa: సీఎం విజయ్‌తో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ పోటీ.. గెలిచింది ఎవరంటే!
గెలిచింది ఎవరంటే!

Grandmaster Praggnanandhaa: తమిళనాడు సచివాలయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇటీవల ప్రతిష్టాత్మకమైన 'నార్వే చెస్ 2026' టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డు సృష్టించిన భారత చెస్ స్టార్, గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సచివాలయంలోనే ప్రజ్ఞానందతో కాసేపు సరదాగా చెస్ ఆడారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కేవలం కొన్ని ఎత్తుల్లోనే ముఖ్యమంత్రిని చెక్‌మేట్ చేసి విజయం సాధించారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద ముఖ్యమంత్రి ఆటతీరును ఎంతగానో అభినందించారు. సీఎం విజయ్ చాలా బాగా ఆడారని, ఈ అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశారు.
ఈ భేటీకి సంబంధించిన దృశ్యాలను తమిళనాడు సమాచార, పౌరసంబంధాల శాఖ విడుదల చేసింది. అందులో ముఖ్యమంత్రి విజయ్, ప్రజ్ఞానంద ఇద్దరూ ఎంతో నవ్వుతూ, ఉత్సాహంగా చెస్ ఆడుతూ కనిపించారు. నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ప్రత్యేక ప్రోత్సాహక నగదు బహుమతి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన అనంతరం ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతూ, ఈ అనుభవం తనకు ఎంతగానో నచ్చిందని, ఇది అసలు ఊహించని ఒక మధుర క్షణమని చెప్పారు.
ముఖ్యమంత్రితో చెస్ ఆడతామని తాము అస్సలు అనుకోలేదని, అదొక పెద్ద సర్‌ప్రైజ్ అని ప్రజ్ఞానంద ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ నగదు బహుమతి తనకు మరింత స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రికి చెస్ ఆడే అలవాటు ఉందనే విషయం తనకు అంతకుముందు తెలియదని, ఆయన టేబుల్ పైనే చెస్ బోర్డు పెట్టి ఆడమని అడిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఎం విజయ్ గతంలో తన స్నేహితులతో కలిసి చెస్ ఆడేవాడినని తనకు చెప్పారని, ఈ మ్యాచ్‌లో తాను గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం చాలా చక్కగా ఎత్తులు వేశారని ప్రజ్ఞానంద ప్రశంసించారు.
మరోవైపు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి ప్రజ్ఞానంద ఈ ఘనత సాధించారు. టోర్నమెంట్ ముగింపు దశలో వరుసగా నాలుగు క్లాసికల్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో, విన్సెంట్ కీమర్ వంటి దిగ్గజాలు ఉన్న ఈ టోర్నీలో చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద అందరికంటే ముందు నిలిచి విజేతగా అవతరించారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో నార్వే దేశపు దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం విశేషం.

