Director Gunasekhar: ఆ పేరు పెట్టడమే మైనస్ అయ్యిందా? .. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్.
గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్.

Director Gunasekhar: దర్శకుడు గుణశేఖర్ తన తాజా చిత్రం ‘యుఫోరియా’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ‘ధురంధర్’ వంటి భారీ విజయాన్ని అందుకుంటుందని తాను బలంగా నమ్మానని, కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని ఆయన తెలిపారు. కమర్షియల్‌గా కూడా ఇది పెద్ద హిట్ అవుతుందని ఆశించినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోవడానికి ‘యుఫోరియా’ అనే టైటిల్ కూడా ఒక కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా చూసిన తర్వాతే ఆ పేరు ఎందుకు పెట్టామో ప్రేక్షకులకు అర్థమవుతోందని, అందుకే రివ్యూలు చూసిన వారంతా ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2 నుంచి ‘ఈటీవీ విన్’ వేదికగా ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందని, త్వరలోనే తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ప్రస్తుత సినిమా ఇండస్ట్రీ పరిస్థితులపై స్పందిస్తూ గుణశేఖర్ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిపోయిందని ఆయన విశ్లేషించారు. పెద్ద సినిమాలను మాత్రమే థియేటర్లలో చూసి, చిన్న సినిమాలను ఓటీటీ కోసం దాచుకుంటున్నారని, ఇందులో ప్రేక్షకుల తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ మనుగడ సాగించాలంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం మూడు నెలల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని ఆయన సూచించారు. అలా మూడు నెలల గ్యాప్ తప్పనిసరి చేస్తేనే, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను చూసేందుకు కూడా ఆడియన్స్ థియేటర్లకు వస్తారని, లేదంటే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు కూడా సరైన ఆదరణ దక్కదని ఆయన అభిప్రాయపడ్డారు.

