GV Prakash Kumar: తెలుగు సినీ రంగంలో జీవీ ప్రకాశ్ కుమార్ హవా.. వరుస విజయాలతో హ్యాట్రిక్
వరుస విజయాలతో హ్యాట్రిక్

GV Prakash Kumar: ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ తెలుగు సినిమా రంగంలో గణనీయమైన స్థానం సంపాదించుకుంటున్నారు.
2006లో ‘వెయిల్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాలకు సంగీతం అందించారు.
వీటిలో ఎక్కువ భాగం తమిళ చిత్రాలే అయినా ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో ఆయన సంగీతం విజయం సాధిస్తోంది.సంగీత దర్శకుడిగా బిజీగా ఉండగానే 2015లో ‘డార్లింగ్’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు.ఇది తెలుగు సినిమా ‘ప్రేమ కథా చిత్రం’కు రీమేక్.
గత ఏడాది మార్చిలో వచ్చిన ‘కింగ్స్టన్’ ఆయనకు హీరోగా 25వ చిత్రం కాగా ప్రస్తుతం నటుడిగా దాదాపు 30 చిత్రాలకు చేరుకున్నారు.తెలుగులో ఇటీవల ఆయన సంగీతం అందించిన చిత్రాలు వరుస విజయాలను తెచ్చిపెట్టాయి.సూపర్ స్టార్ కృష్ణ మనవడు జైకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’కు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.ఈ చిత్రంలోని పాటలకు మంచి పేరు వచ్చినా వాణిజ్యపరంగా అంతగా విజయం సాధించలేదు.
అయితే కృష్ణ అభిమానులు ఒక సెంటర్లో ఈ సినిమాను వంద రోజులు ఆడించారు.ఆ తర్వాత వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం జీవీ ప్రకాశ్ సంగీత పరిధిని మరోసారి చాటిచెప్పింది.పాటలు మాత్రమే కాకుండా ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు కూడా జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో మంచి పేరు సంపాదించింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులో బాగా విజయం సాధించింది.తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఆకాశంలో ఒక తార’ శుక్రవారం విడుదలైంది.ఈ చిత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకు నేపథ్య సంగీతంతోనే సాగింది.కథలోని ఆత్మను గుర్తించి తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశారు జీవీ.ఈ చిత్రానికి దక్కుతున్న విజయంలో ఆయన సంగీతం కీలకమైన పాత్ర పోషించింది.ఈ మధ్యలో వచ్చిన ‘మండాడి’ చిత్రానికి కూడా జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.అది కూడా మంచి విజయాన్ని సాధించింది.
ఈ విధంగా ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్, ఆకాశంలో ఒక తారలతో తెలుగులో వరుసగా మూడు విజయాలు సాధించారు జీవీ.ప్రస్తుతం ఆయన ‘హవా’ తెలుగు సినిమా రంగంలో బాగా వీస్తోంది.సంగీత దర్శకుడిగా, నటుడిగా రెండు రంగాల్లోనూ ఆయన పేరు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.తెలుగు ప్రేక్షకులు ఆయన సంగీతాన్ని ఆదరిస్తున్నారు.
ఈ విజయాలతో జీవీ ప్రకాశ్ కుమార్ తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో ముందున్న వారిలో ఒకరిగా నిలుస్తున్నారు.భవిష్యత్తులో మరిన్ని తెలుగు చిత్రాలకు సంగీతం అందించే అవకాశం ఉంది.

