Ramya: సంతోషానికి పెళ్లితో సంబంధం లేదు..రమ్య బోల్డ్ కామెంట్స్ వైరల్
రమ్య బోల్డ్ కామెంట్స్ వైరల్

Ramya: పెళ్లి ఉంటేనే జీవితం పరిపూర్ణం అవుతుందనే సమాజపు ఆలోచనపై శాండల్‌వుడ్ క్వీన్, ప్రముఖ నటి రమ్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వివాహం అనేది మనిషి జీవితంలో సంతోషాన్ని నిర్దేశించలేదని ఆమె స్పష్టం చేశారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితం పట్ల వారి దృక్పథంపై రమ్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమ్య మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అయిన అవసరం కాదనే కోణంలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. సమాజంలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటేనే సమాజం గుర్తింపు ఇస్తుందని, అదే అసలైన సంతోషం అని భావిస్తుంటారని.. కానీ అందులో వాస్తవం లేదన్నారు. వివాహ బంధం వెలుపల కూడా మహిళలు తమ స్వయంకృషితో, తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంటూ ఎంతో ఆనందంగా జీవించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. జీవితంలో సంతోషం అనేది ఒకరితో కలిసి ఉండటంలోనే కాకుండా, మనల్ని మనం ప్రేమించుకోవడంలో, మన లక్ష్యాలను సాధించడంలో ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో 'సందల్వుడ్ క్వీన్'గా ఒక వెలుగు వెలిగిన రమ్య, కేవలం నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆమె తన వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడూ స్వతంత్ర భావాలతోనే ముందుకు సాగారు. ఇప్పుడు ఆమె చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ చూసి నెటిజన్లు, ముఖ్యంగా మహిళా లోకం ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతోంది. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో వివాహంపై ఆలోచనా విధానం మారాలని చెప్పేలా రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

