వాళ్లకు మాత్రమే అనుమతి!

‘Hari Hara Veera Mallu’ Pre-Release Event: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఈరోజు, జూలై 21, 2025, హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ ఈవెంట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో పాటు, కర్ణాటక మంత్రి పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొదటి సినిమా ఈవెంట్ ఇది. దీంతో అభిమానులు ఆయన ప్రసంగం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ కోరింది. అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సినిమా విడుదలకు పది రోజుల ముందు నుంచే మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేశారు. "మేకింగ్ ఆఫ్" వీడియో, కొత్త పాటల విడుదల వంటివి ఇప్పటికే జరిగాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జులై 24న విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సినిమా విశేషాలతో పాటు ఇతర అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story