సోషల్ మీడియా వివాదానికి ముగింపు..

Harish Shankar Apologizes: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్ తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్ ప్రచార సమయంలో సోషల్ మీడియాలో జరిగిన ఒక చిన్న పొరపాటు పెద్ద వివాదానికి దారితీయడంతో ఆయన వెంటనే స్పందించారు.

వివాదం ఎలా మొదలైంది?

పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి పోస్ట్ చేస్తూ.. ఈ చిత్రం మహేశ్‌ బాబు సినిమాల రికార్డులను బద్దలు కొట్టాలంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌కు హరీశ్‌ శంకర్ స్పందించి రిప్లై ఇవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. తమ హీరోను తక్కువ చేసేలా ఆ రిప్లై ఉందని భావించిన అభిమానులు హరీశ్‌ శంకర్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

హరీశ్‌ శంకర్ వివరణ:

వివాదం ముదరక ముందే రంగంలోకి దిగిన హరీశ్‌ శంకర్, అసలేం జరిగిందో వివరిస్తూ పోస్ట్ చేశారు. సినిమా షూటింగ్, సెన్సార్ పనుల ఒత్తిడిలో ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని తెలిపారు.

మహేశ్‌ బాబుపై గౌరవం:

తనకు మహేశ్‌ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో తాను ఆయన పోకిరి సినిమాను మనస్ఫూర్తిగా ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజమౌళి - మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోయే భారీ చిత్రం అన్ని రికార్డులను తిరగరాయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మనోభావాలు దెబ్బతింటే క్షమించండి

తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల దగ్గర పడుతున్న సమయంలో కావాలని ఇటువంటి వివాదాలు సృష్టించే వ్యక్తిని తాను కాదని ఆయన స్పష్టం చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story