భర్తపై ప్రేమను కురిపించిన సమంత

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడమోరు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో రాజ్ తనకు కొండంత అండగా నిలిచారని ఆమె భావోద్వేగపూరితంగా వెల్లడించారు.

విజయానికి మూలస్తంభం ఆయనే

తన వ్యక్తిగత ఎదుగుదల వెనుక రాజ్ పాత్రను కొనియాడుతూ.. "నేను ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నానంటే, ఒక నటిగా నాలో కొత్త కోణాలను వెలికితీశానంటే దానికి కారణం రాజే. ఆయన ప్రోత్సాహం వల్లే నా పనితీరులో లోతు పెరిగింది" అని సమంత చెప్పుకొచ్చారు. కేవలం భర్తగానే కాకుండా, ఒక మంచి స్నేహితుడిగా, గైడ్‌గా రాజ్ తనకు అండగా ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు.

ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనంతగా..

తమ మధ్య ఉన్న అనుబంధం గురించి సమంత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తామిద్దరం షూటింగ్‌లోనే కాకుండా జిమ్‌లో వర్కవుట్స్ దగ్గర నుండి ప్రయాణాల వరకు అన్ని పనులు కలిసే చేస్తామని చెప్పారు. షూటింగ్ పనుల మీద రాజ్ ఒక రోజు దూరంగా వెళ్లినా తాను తట్టుకోలేనంతగా తమ బంధం బలపడిందని ఆనందం వ్యక్తం చేశారు.

మా ఇంటి బంగారం కోసం జట్టుకట్టిన జోడీ..

ప్రస్తుతం రాజ్ నిడమోరు నిర్మాణ సారథ్యంలో వస్తున్న మా ఇంటి బంగారం అనే చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓ బేబీ వంటి హిట్ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఈ జంట కెమిస్ట్రీ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

రాజ్ నిడమోరుతో వివాహం తర్వాత సమంత తన కెరీర్‌లో సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి బంధం ఇలాగే కలకాలం కొనసాగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story