Hero Vishal Expresses: తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలపై మరో స్టార్ హీరో విశాల్ తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు కేటాయించడం సంతోషకరమే అన్న విశాల్.. సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.

రాజ్‌మోహన్‌కు ఫిల్మ్‌టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్‌ యాక్ట్‌ శాఖ కేటాయించడం నన్ను ఎంతగానో నిరుత్సాహ పరిచింది అని విశాల్ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సినీ రంగానికి సంబంధించిన విజ్ఞప్తులను, ఏ అనుభవమూ లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలం? అని ప్రశ్నించారు. 30 ఏళ్ల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా సీఎం విజయ్‌కు క్షేత్రస్థాయి సమస్యలు పూర్తిగా తెలుసని.. అలాంటిది ఈ రంగానికి అసలు సంబంధం లేని వారికి ఎలా వివరించగలమని నిలదీశారు. అయితే ఇక్కడ రాజ్‌మోహన్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని విశాల్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తమిళ సినీ పరిశ్రమ మనుగడ కోసం విశాల్ కొన్ని కీలక డిమాండ్లను సీఎం విజయ్ ముందుంచారు. రాష్ట్రంలో పారదర్శకత కోసం వెంటనే 'ప్రభుత్వ టికెటింగ్ విధానాన్ని' తీసుకురావాలని, దీనివల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుందని చెప్పారు. దేశమంతటా ‘ఒకే దేశం ఒకే పన్ను’ ఉన్నా.. తమిళనాడులో మాత్రం అదనంగా స్థానిక సంస్థల పన్ను విధిస్తున్నారని, దాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే చిన్న చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని కోరారు. ఈ విషయాలపై సీఎంవోకు వినతిపత్రం ఇవ్వొచ్చు కానీ.. గత 9 ఏళ్లుగా ఇలాంటి వినతులు ఇస్తూనే ఉన్నామని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి విజయ్ తగిన ఊరట కల్పిస్తారని ఆశిస్తున్నట్లు చెప్తూ విశాల్ ఈ పోస్ట్‌ను ముగించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story