Heroine Kavya Kalyanram: టెక్నీషియన్‌తో 'బలగం' భామ ఏడడుగులు!
'బలగం' భామ ఏడడుగులు!

Heroine Kavya Kalyanram: టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల రష్మిక మందన్న వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేయగా, ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ టెక్నీషియన్‌తో కావ్య ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో, ప్రస్తుతం వివాహ పనులు చకచకా జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ కావ్య అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన కావ్య కళ్యాణ్‌రామ్, హైదరాబాద్‌లోనే పెరిగి పెద్దయ్యారు. చిన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసిన ఈమె, ఆ తర్వాత పలు సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకున్నారు. అయితే హీరోయిన్‌గా మాత్రం 'మసూద' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ సినిమాలో కావ్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్న తరుణంలోనే, ఈ చిన్నది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

