నిర్మాతలకు హైకోర్టు షాక్..

High Court Delivers a Shock : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కీలక తీర్పునిచ్చింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసు ప్రస్తుతం సింగిల్ జడ్జి వద్ద విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల వల్ల సినిమా విడుదల ఆగిపోలేదని, కాబట్టి నిర్మాతలు తమ అభ్యంతరాలను సింగిల్ బెంచ్ ముందే తేల్చుకోవాలని సూచించింది.

అసలు వివాదం ఏమిటి?

సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ అనుమతి ఇవ్వడంపై న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ భవిష్యత్తు కోసం కఠిన నిబంధనలు విధించారు.. ఏదైనా సినిమా టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రజలకు వెల్లడించాలి. తద్వారా పారదర్శకత పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ధరల పెంపునకు జీవో ఇచ్చినందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి సి.వి. ఆనంద్‌ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. పెంచిన ధరల వల్ల సుమారు రూ. 42 కోట్లు అక్రమంగా వసూలు చేశారని, ఆ మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు.

సింగిల్ జడ్జి విధించిన 90 రోజుల నోటీసు నిబంధన భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రూ. 42 కోట్ల రికవరీ పిటిషన్‌పై ఫిబ్రవరి 3న జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story