Horror Thriller ‘418’: చీకటి గదులు, అర్థంకాని శబ్దాలు, ఊహించని మలుపులు, వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెట్టిన హారర్ థ్రిల్లర్ ‘418’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి మొత్తం ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నవంబర్ 20 విడుదల తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో సూర్య రాజ్, చైత్ర ఆచార్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 418 నంబర్ గది చుట్టూ తిరిగే మిస్టరీ, అక్కడ చోటుచేసుకునే అతీంద్రియ సంఘటనలు కథలో ఆసక్తిని పెంచుతాయి. వివేక్ శంకర్ (సూర్య రాజ్)ను డాక్టర్‌గా చూడాలనేది అతడి తల్లిదండ్రుల కల. ఇందుకోసం ఆస్తులు అమ్మి మరీ అతడిని మెడికల్ కాలేజీలో చేర్పిస్తారు.

ఆ కాలేజీకి చెందిన హాస్టల్ గతంలో మానసిక చికిత్స కేంద్రంగా ఉండేది. దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి తెరిచిన ఈ హాస్టల్‌లో '418' నంబర్ గదిని మాత్రం మూసే ఉంచుతారు. అక్కడ ఏదో అతీంద్రియ శక్తి ఉందనే భయం అందరిలోనూ ఉంటుంది. వివేక్ 417 గదిలో చేరిన తర్వాత అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. అతడి స్నేహితుడు రోహిత్ (చరణ్ లక్కరాజు) మాత్రం మొదట వాటిని నమ్మడు. ఇంతకీ '418' గదిలో ఏముంది? దేవిక (చైత్ర ఆచార్) ఎవరు? సాయేషా (ప్రీతి పగడాల) ఆ గదిలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

హారర్ సినిమాలకు ప్రధాన బలం వాతావరణం, సౌండ్ డిజైన్, ఉత్కంఠ. ఈ విషయంలో '418' కొంతవరకు మెప్పిస్తుంది. చీకటి హాస్టల్, మూసి ఉంచిన గది, వింత శబ్దాలు భయానక అనుభూతిని కలిగిస్తాయి. అయితే కథ ప్రారంభంలో ఏర్పడిన ఆసక్తిని దర్శకుడు కిర్తన్ నాడగౌడ అన్ని సందర్భాల్లోనూ కొనసాగించలేకపోయారు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్‌లో దేవిక నేపథ్యం, భావోద్వేగ సన్నివేశాలు కథకు కొంత బలాన్నిస్తాయి. చివరి భాగంలో భయం పెరిగినా, క్లైమాక్స్ మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ చైత్ర ఆచార్. దేవిక పాత్రలో ఆమె నటన, హావభావాలు కొన్ని సన్నివేశాల్లో భయపెట్టడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తాయి.

ప్రేక్షకులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ థ్రిల్లర్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. మూసి ఉంచిన 418 గది రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తి పెరిగింది. థియేటర్లలో చూడనివారికి ఇది మంచి అవకాశం. నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. హారర్ ప్రేమికులు ఈ చిత్రాన్ని మిస్ చేయకూడదు.

Next Story