Hrithik Roshan Seen Using Crutches; ఊతకర్రల సాయంతో హృతిక్ రోషన్.. ఆందోళనలో అభిమానులు! అసలేం జరిగింది?
ఆందోళనలో అభిమానులు! అసలేం జరిగింది?

Hrithik Roshan Seen Using Crutches; హృతిక్ రోషన్ ఇటీవల ముంబైలో జరిగిన ఫిల్మ్‌మేకర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. అయితే పార్టీ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చే క్రమంలో క్రచెస్ సాయంతో నెమ్మదిగా నడుస్తూ కనిపించారు. సాధారణంగా కెమెరా ముందుకు రాగానే ఎంతో ఉత్సాహంగా పోజులిచ్చే హృతిక్, ఈసారి మాత్రం ఫొటోగ్రాఫర్లకు మర్యాదపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన ముఖంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుండటంతో హృతిక్‌కు ఏమైంది? పాత గాయాలు మళ్ళీ తిరగబెట్టాయా? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెనోరిటా షూటింగ్ సమయంలోనూ విపరీతమైన నొప్పి
హృతిక్ ఇలా శారీరక నొప్పులతో పోరాడటం ఇదే మొదటిసారి కాదు. జిందగీ నా మిలేగీ దుబారా సినిమాలోని ఎంతో ఉత్సాహంగా సాగే సెనోరిటా సాంగ్ వెనుక ఉన్న ఒక చేదు నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. సెనోరిటా పాటను మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు హృతిక్ చాలా సరదాగా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ ఆ షూటింగ్ సమయంలో ఆయన భరించలేనంత నొప్పితో ఉన్నారు. ఆ నొప్పిని తట్టుకుంటూనే ఆయన అద్భుతమైన స్టెప్పులు వేశారు" అని బోస్కో తెలిపారు.
హృతిక్ రోషన్ కెరీర్ ఆరంభం నుంచీ డిస్క్ సమస్యలు, మోకాలి నొప్పులు, ఇతర శారీరక గాయాలతో సతమతమవుతూనే ఉన్నారు. అయినప్పటికీ వెండితెరపై తన డాన్స్‌తో, యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ తగ్గలేదు. తాజా ఘటనతో ఆయన పాత గాయాల తీవ్రత మళ్ళీ పెరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

