కొత్త నిర్వచనం చెబుతున్న శ్రుతి హాసన్

Shruti Haasan Defines: సాధారణంగా ఎవరికైనా ఇల్లు అంటే నాలుగు గోడలు, ఒక అడ్రస్ లేదా ఒక ఊరు. కానీ హీరోయిన్ శ్రుతి హాసన్ దృష్టిలో ఇల్లు అంటే అది ఒక భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు.. అదొక అంతర్గత అనుభూతి. తాజాగా ఆమె ఇల్లు అనే భావనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాం అయ్యాయి. బహుభాషా చిత్రాల్లో నటిస్తూ నిరంతరం ప్రయాణాల్లో ఉండే శ్రుతికి ఒక్కో నగరం ఒక్కో అనుభూతిని ఇస్తుందట.

చెన్నై అనంతమైన ప్రేమ, సౌకర్యానికి కేరాఫ్ అడ్రస్, ముంబై మరో రకమైన ఆత్మీయత, హైదరాబాద్ పని పరంగా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన అనుబంధం.. ఇలా ప్రతి నగరం తనదైన శైలిలో తనను ఆలింగనం చేసుకుంటుందని శ్రుతి తెలిపారు.

ఎక్కడైనా.. ఎప్పుడైనా..

కాలక్రమేణా తన ఆలోచనా విధానం మారిందని చెబుతూ.. "నన్ను ఏ ప్రదేశంలో వదిలేసినా అక్కడ నేను సౌకర్యాన్ని వెతుక్కోగలను. అక్కడి సంస్కృతిని, ప్రజలను ప్రేమిస్తూ ఆ ప్రదేశాన్ని నా సొంతం చేసుకుంటాను. నిజానికి నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు" అని ఆమె స్పష్టం చేశారు. మనసులో ప్రశాంతత లేనప్పుడు, సొంత ఇంట్లో ఉన్నా అసౌకర్యంగానే ఉంటుంది. అందుకే నాకు నేనే ఇల్లుగా భావిస్తానని ఆమె తెలిపారు.

తనలో తాను సౌకర్యంగా ఉండటమే తనకు గొప్ప భద్రతను ఇస్తుందని శ్రుతి అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచన వల్ల జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుందని ఆమె అన్నారు. ఇక వ్యక్తుల విషయానికి వస్తే, తన తండ్రి కమల్ హాసన్ దగ్గర తప్ప మరెవరి దగ్గరా తనకు అంతటి సౌకర్యవంతమైన 'ఇల్లు' లాంటి అనుభూతి కలగలేదని ఆమె భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story