Dhanush: సినిమాల్లో అగ్రనాయకుడిగా వెలుగొందుతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్... తన బాల్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, భావోద్వేగ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలో అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

జులై 28 తనకు కేవలం ఒక సాధారణ తేదీ మాత్రమేనని చెబుతూ ధనుష్ మాట్లాడుతూ... 'చిన్నతనంలో నా ఫ్రెండ్స్ వాళ్ల పుట్టినరోజుకు కొత్త డ్రెస్సులు వేసుకుని, స్కూల్లో చాక్లెట్లు పంచుతుంటే చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించేది. నేను నాలుగో తరగతి చదివే వరకు అసలు నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. స్కూల్లో అందరినీ చూసి నేను కూడా అలాగే వేడుక చేసుకోవాలని అనుకునేవాడిని' అని గుర్తుచేసుకున్నారు.

ఇదే విషయాన్ని తన అక్కకు చెబితే... ఆమె తన పుట్టినరోజు జులై 28 అని చెప్పిందని ధనుష్ తెలిపారు. ఆ రోజుల్లో వాళ్ళ అమ్మనాన్న కేవలం దీపావళి, సంక్రాంతి పండుగలకు మాత్రమే కొత్త బట్టలు కొనిచ్చేవారని, కానీ పుట్టినరోజు నాడు కూడా కొత్త బట్టలు కావాలని గోల చేసి మరీ కొనిపించుకున్నానని ఆయన నవ్వుతూ చెప్పారు. తన దగ్గర ఉన్న చిన్నచిన్న డబ్బులతో ఆశ చాక్లెట్లు కొని స్కూల్లో అందరికీ పంచుతుంటే... ఆ ఒక్క రోజే తనకు ఎంతో ప్రత్యేకంగా, ప్రపంచమే తన చేతిలో ఉన్నట్లు అనిపించేదని ఆయన ఎమోషనల్ అయ్యారు.

అయితే ఏళ్లు గడిచేకొద్దీ తనకు పుట్టినరోజులపై ఆసక్తి తగ్గిపోయిందని ధనుష్ తెలిపారు. కానీ నేడు తన పుట్టినరోజును అభిమానులు ఇంత వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఒక గొప్ప పిలుపునిచ్చారు. కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, స్థానికంగా సామాజిక సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని ధనుష్ కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story