Rajamouli: మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త ఫాంటసీ ఎంటర్‌టైనర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై రాజమౌళి, ఎన్టీఆర్ వ్యక్తం చేసిన నమ్మకం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

కథ విని ఫిదా అయ్యా.. సినిమా చూసి ఏడ్చేశా: ఎస్.ఎస్. రాజమౌళి

ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మూడేళ్ల క్రితం దర్శకుడు శశాంక్ ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి కథ అనే చిన్న లైన్‌తో వచ్చి, ఆ తర్వాత మూడు గంటలు అద్భుతమైన కథనం వినిపించాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. సినిమా చూసిన తర్వాత నేను తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎమోషనల్‌గా అంతగా కనెక్ట్ అవుతారు. ఫహాద్ ఫాజిల్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతారు. నిర్మాతగా మారిన కార్తికేయ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అక్టోబర్ 2న థియేటర్లలో ఒక గొప్ప సినిమాను ప్రేక్షకులు చూస్తారు’’ అని ధీమా వ్యక్తం చేశారు.

దేశం గర్వించదగ్గ నటుడు ఫహాద్.. కార్తికేయకు నా అండ: ఎన్టీఆర్

వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన తారక్ మాట్లాడుతూ.. తన గాయం నయమైందని, డ్రాగన్ చిత్రం అనుకున్న సమయానికే విడుదలవుతుందని స్పష్టం చేస్తూనే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘‘దేశంలో నాకు నచ్చే అతి తక్కువ మంది నటుల్లో ఫహాద్ ఫాజిల్ మొదటి స్థానంలో ఉంటారు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడు. తెలుగులో ఆయన హీరోగా చేస్తున్న తొలి సినిమా భారీ విజయం సాధించాలి. బాహుబలి, RRR చిత్రాల సక్సెస్ వెనుక కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. నా తమ్ముడు కార్తికేయ నిర్మాతగా తొలి అడుగు వేయడం చాలా గర్వంగా ఉంది’’ అని కొనియాడారు.

హైదరాబాద్‌లో 75 రియల్ లొకేషన్లలో షూట్.. ఎస్.ఎస్. కార్తికేయ

నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ.. తాను అడగకుండానే కేవలం తమ్ముడిపై ఉన్న ప్రేమతో వచ్చి సపోర్ట్ చేసిన ఎన్టీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఫహాద్ ఫాజిల్‌తో సినిమా చేయడం తన అదృష్టమని, హైదరాబాద్‌లోని 75 సహజమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపామని, ఇది అందరికీ నచ్చే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు.

Next Story