Ibomma Website Shut Down: ఐబొమ్మ వెబ్‌సైట్ క్లోజ్: నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

Ibomma Website Shut Down: తెలుగు సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని కూకట్‌పల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్మడి రవి అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నవంబర్ 14వ తేదీన రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగా, సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో కొత్త సినిమాలు థియేటర్‌లో లేదా ఓటీటీలో విడుదలైన గంటలోనే అక్రమంగా ప్రసారం అవుతున్నాయి. ఈ పైరసీ కారణంగా సినీ నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇమ్మడి రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సుమారు ₹ 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే, వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించిన సర్వర్‌లో ఉన్న మూవీ కంటెంట్‌ను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పైరసీ వల్ల కోట్ల నష్టం వస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్‌కు ముందు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గతంలో 'దమ్ముంటే పట్టుకోవాలంటూ' పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరినట్లు కూడా వార్తలు వచ్చాయి. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పైరసీ నెట్‌వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని పోలీసులు సోమవారం (నవంబర్ 17) రోజున మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ కేసులో మరింత సమాచారం వెల్లడించనున్నారు. ఈ అరెస్ట్ సినీ పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది, అయితే పైరసీపై పోరాటం మరింత బలంగా కొనసాగాల్సిన అవసరం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

