'Idupu Kayitam': టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం'. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే, సినిమా షూటింగ్ మొదలైందో లేదో.. అప్పుడే ఈ చిత్రం ఒక వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం.. ఈ సినిమాకు పెట్టిన డిఫరెంట్ టైటిల్.

'ఇడుపు కాయితం అనే పేరు వినడానికి కాస్త కొత్తగా, వింతగా ఉండటంతో.. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని దీనిపై నెగెటివ్ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ టైటిల్ వెనుక ఏదో తప్పుడు అర్థం ఉందంటూ కొందరు వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ టైటిల్ రచ్చపై సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. వివాదాలు సృష్టిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ, హితవు పలికారు. సినిమాను సినిమాగానే చూడాలని, టైటిల్స్ వెనుక ఉన్న కథను అర్థం చేసుకోకుండా వివాదాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఇతర భాషా చిత్రాలను ఉదాహరణగా చూపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళంలో 'కరుప్పు' అన్నా, కన్నడంలో 'కాంతార' అన్నా మనకు ముందే అర్థాలు తెలుసా? వాటి అర్థాలు తెలియకపోయినా.. కంటెంట్ బాగుంది కాబట్టే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలను భారీ హిట్లు చేయలేదా? అలాంటప్పుడు మన తెలుగు సినిమా టైటిల్ విషయంలో ఇంత రచ్చ ఎందుకు?" అని నరేశ్ ప్రశ్నించారు.

'ఇడుపు కాయితం' అనేది పక్కా తెలుగు పదమని.. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వ్యవసాయం లేదా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ పదాన్ని వాడుతుంటారని చిత్రబృందం చెబుతోంది. ఇదే విషయాన్ని నరేశ్ కూడా గుర్తు చేస్తూ.. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించేసి, మన తెలుగు భాషను, మన సినిమాలను మనమే కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న ప్రియదర్శి నటిస్తున్న ఈ సినిమా.. ఈ టైటిల్ వివాదాన్ని దాటుకుని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story