చెప్పుతో కొట్టుకోవాలా?: మారుతి ఆవేదన

Director Maruti’s Emotional Statement: ప్రముఖ దర్శకుడు మారుతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. సినిమాలు ఫ్లాప్ అయితే కొందరు దర్శకులు వింతగా ప్రవర్తించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ఆడకపోతే చెప్పుతో కొట్టుకోవడం, సినిమాలు మానేస్తానని ప్రకటించడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన బ్యూటీ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మారుతి, ఈ సందర్భంగా తన మనసులో మాటను పంచుకున్నారు. ఇటీవల ఒక దర్శకుడు తన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుతో కొట్టుకున్న ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఒక దర్శకుడు తీసిన త్రిబాణదారి బార్బరిక్ సినిమా ఆడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. ఆ టైటిల్ ఎవరికీ అర్థం కాదని చెప్పినా వినలేదు. సినిమా ఫ్లాప్ అయితే ఇలాంటి పనులు చేయడం చూసి చాలా బాధేసింది" అని అన్నారు.

కళాకారులను తయారుచేసే వాళ్లు ఇలాంటి పనులు చేయకూడదు. ఒక సినిమా ఆడకపోతే మరో సినిమా ఆడుతుంది. అంతేకానీ ఇంతగా దిగజారాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కొందరు వింతగా ప్రవర్తిస్తూ, బూతులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా, తన కెరీర్‌పై వస్తున్న విమర్శలపైనా మారుతి స్పందించారు. "నన్ను చాలామంది బూతు డైరెక్టర్ అంటుంటారు. నేను రాసినన్ని మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ఎవరూ రాయలేరు. కానీ కుటుంబాలు సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలాంటివి రాయడం లేదు. ఇప్పుడు అదే బూతు డైరెక్టర్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ది రాజాసాబ్ సినిమా తీస్తున్నాడు" అని అన్నారు. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నానని, ఒక ఫ్లాప్ తర్వాత కూడా ప్రభాస్ తనకు అవకాశం ఇచ్చారంటే తనపై ఆయనకు ఉన్న నమ్మకమే అందుకు కారణమని మారుతి తెలిపారు. ప్రస్తుతం మారుతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story