RGV’s Explosive Remarks: 18 ఏళ్ల వ్యక్తి ఓటు వేయగలిగేటప్పుడు, సినిమాను ఎంచుకోలేడా.. సినిమా సెన్సార్‌షిప్‌పై ఆర్‌జీవీ సంచలన వ్యాఖ్యలు
ఆర్‌జీవీ సంచలన వ్యాఖ్యలు

RGV’s Explosive Remarks: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టార్గెట్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు. ప్రస్తుతం అమల్లో ఉన్న చలనచిత్ర సెన్సార్ విధానంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలకు సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకుల విజ్ఞతను అవమానించడమేనని, కాలం చెల్లిన ఈ పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. డిజిటల్ విప్లవం నడుస్తున్న ఈ రోజుల్లో కూడా సెన్సార్ బోర్డు ఉనికిని చాటుకోవడంపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పోస్ట్‌లోని ప్రధానాంశాలు ఇవే..
ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ప్రశ్నలు:
"దేశాన్ని పాలించే నాయకుడిని ఎన్నుకునేందుకు 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం, వారు ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదు?" అని వర్మ ప్రశ్నించారు. స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీల కాలంలో ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రేక్షకులను కాపాడుతుందనుకోవడం మూర్ఖత్వమన్నారు. ప్రజలను ఇంకా చిన్నపిల్లలుగా చూడటం ఆపాలని హితవు పలికారు.
డిజిటల్ యుగంలో సెన్సార్‌షిప్ విఫలం:
థియేటర్ల కోసం సినిమాల్లో సీన్లు కట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వర్మ ఉదాహరణలతో సహా వివరించారు. థియేటర్లలో కట్ చేసిన సీన్లు కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయని గుర్తుచేశారు. ఇటీవల అబ్సెషన్ చిత్రంలోని ఒక హింసాత్మక సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగిస్తే, ఆ సీన్‌ను థియేటర్ల కంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే పది రెట్లు ఎక్కువ మంది చూశారని పేర్కొన్నారు. సెన్సార్ కట్‌లు కంటెంట్‌ను ఆపలేవని, పైగా వాటికి మరింత క్రేజ్ తెచ్చిపెడతాయని స్పష్టం చేశారు.
పరిశ్రమకు పిలుపు.. కోర్టుల్లో తేల్చుకుందాం:
చిత్ర పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు ఇకనైనా సెన్సార్ అధికారుల ముందు మోకరిల్లడం ఆపాలని ఆర్‌జీవీ పిలుపునిచ్చారు. రాజీపడటం వల్ల బోర్డు అనాగరిక శక్తులకు మరింత బలాన్ని ఇచ్చినట్లవుతుందన్నారు. సెన్సార్ బోర్డు ఉనికిని న్యాయస్థానాలతో పాటు బహిరంగ చర్చల్లో సవాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
పరిష్కారం ఏంటి?
సినిమాల్లోని సన్నివేశాలను కత్తిరించడం కాకుండా, కేవలం ఆ చిత్రంలో ఎలాంటి కంటెంట్ ఉందో రేటింగ్ ఇచ్చి వదిలేయాలని వర్మ సూచించారు. ఆ సినిమా చూడాలో లేదో నిర్ణయించుకునే హక్కును పూర్తిగా ప్రేక్షకుడికే ఇవ్వాలన్నారు. డిజిటల్ ప్రపంచంలో సినిమాను నిర్బంధించడం భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమేనని పేర్కొంటూ #BanTheCensor అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన పోస్ట్‌ను ముగించారు.

