AR Rahman: బాలీవుడ్ ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ స్వరాలపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్ కుండబద్దలు కొట్టారు. కళలో ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని సంతృప్తిపరచడం సాధ్యం కాదని, అలాంటి వ్యాఖ్యలకు తాను జవాబుదారీ కానవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహమాన్, యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ గతంలో చెప్పిన సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలని భావిస్తే.. సంగీతం కాకుండా ఐస్‌క్రీమ్‌లు అమ్ముకోవడమే ఉత్తమం" అంటూ తనదైన శైలిలో చురకలంటించారు. ఇటీవల నితేశ్‌ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన మంగళ్‌ రంగ్‌ గీతంపై కొందరు నెటిజన్లు పెదవి విరవడంపై ఆయన ఇలా ప్రతిస్పందించారు.

సంగీతం ఊరగాయ లాంటిది.. ఆస్వాదించడానికి సమయం పడుతుంది

ఓ గీతం వెనుక ఎంతో పరిశోధన, కళాత్మక శ్రమ దాగి ఉంటాయని రెహమాన్ గుర్తుచేశారు. "ఒక పాటను విడుదలైన వెంటనే అంచనా వేయడం సరికాదు. ఊరగాయ ఊరే కొద్దీ రుచి పెరిగినట్లే.. ఉత్తమ స్వరాలు కూడా కాలం గడిచేకొద్దీ శ్రోతల హృదయాలకు హత్తుకుంటాయి. కేవలం బాహ్య వినోదమే కాకుండా మన సాంస్కృతిక మూలాలను దృష్టిలో ఉంచుకుని సంగీతం సమకూర్చాల్సి ఉంటుంది. ప్రేక్షకులు దీనిని అర్థం చేసుకోవడానికి కాస్త సంయమనం పాటించాలి" అని పేర్కొన్నారు.

హాలీవుడ్ లెజెండ్ హాన్స్‌ జిమ్మర్‌తో కలిసి పది సినిమాలంత కష్టం

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ దిగ్గజ స్వరకర్త హాన్స్‌ జిమ్మర్‌తో కలిసి పనిచేయడంపై రెహమాన్ మాట్లాడారు. జిమ్మర్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతో ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు పెరిగాయని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక వెర్షన్లు, ఐదు ప్రధాన భాషలకు అనుగుణంగా ఆర్కెస్ట్రేషన్ సమకూర్చడం వల్ల దాదాపు పది పూర్తి స్థాయి చిత్రాలకు సరిపడా శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించారు. రణ్‌బీర్‌ కపూర్, సాయిపల్లవి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ దృశ్య కావ్యం రెండు పార్టులుగా విడుదల కానుంది. అందులో భాగంగా మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 5న వెండితెరపైకి రానుంది.

Next Story