కార్తీ

Karthi: కమల్ హాసన్ కు భారతీయుడు ఎలాంటి ప్రైడ్ ఇస్తుందో... తన కెరీర్‌లో 'సర్దార్' సినిమా అలాంటి మైలురాయిగా నిలిచిపోతుందని హీరో కార్తి అన్నారు. దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తుండగా... ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ నెల 10న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యువ హీరో అడివి శేష్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ... 'ప్రస్తుతం తెలుగు చిత్రసీమ చాలా అద్భుతంగా ఉంది. విడుదలైన ప్రతి సినిమా విజయవంతమవుతోంది. ఇలాంటి గోల్డెన్ టైమ్‌లో వస్తున్న సర్దార్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఇక హీరో కార్తి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 'సర్దార్ లాంటి స్పై పాత్ర దొరకడం నా అదృష్టం. గూఢచారుల జీవితాలు త్యాగాలతో కూడుకున్నవి. ఈ చిత్రంలో మహిళా శక్తికి పెద్దపీట వేశాం. ఇందులో డ్యాన్స్‌లు ఉండవు... మన హీరోయిన్లు ఇద్దరూ ఏకంగా యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొడేశారు' అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో వై. రవిశంకర్, సాయిబాబా, బీవీఎస్ఎన్ ప్రసాద్, అభిషేక్, ఎస్. నాగవంశీ, కల్యాణ్ శంకర్ తదితర ప్రముఖులు పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

