Mahie Gill: అలాంటి పాత్రలతో విసిగిపోయాను.. మహీ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మహీ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Mahie Gill: డిజిటల్ విప్లవం మూవీ ఇండస్ట్రీ స్వరూపాన్నే మార్చేసిందని, ముఖ్యంగా మహిళా నటులకు వైవిధ్యమైన పాత్రలు లభించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రముఖ నటి మహీ గిల్ వ్యాఖ్యానించారు. తన లేటెస్ట్ డిజిటల్ సిరీస్ రక్తాంచల్ 3 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ పయనం, మూస పాత్రల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ మూస ఇమేజ్‌తో విసిగిపోయా..
తన కెరీర్‌లో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతుండగా మహీ గిల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు దాదాపు ఒకే తరహా పాత్రలు వచ్చేవి. నిరంతరం చీరకట్టు, చేతిలో సిగరెట్, మద్యం గ్లాసుతో ఉండే గ్లామరస్ క్యారెక్టర్లనే ఎక్కువగా ఆఫర్ చేశారని, ఆ మూస ఇమేజ్ నుంచి బయటపడాలని తీవ్రంగా ఆరాటపడ్డానని వెల్లడించారు.
కొత్త సవాలుగా సరస్వతి దేవి:
ఆ సమయంలోనే రక్తాంచల్ 3లో లభించిన సరస్వతి దేవి పాత్ర తనలోని నటికి కొత్త సవాలు విసిరిందని, తన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు దోహదపడిందని సంతోషం వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల విరామం.. ప్రాజెక్టులు కోల్పోయినా నో రిగ్రెట్స్..
వ్యక్తిగత కారణాల వల్ల సుమారు నాలుగేళ్ల పాటు నటనా రంగానికి దూరంగా ఉన్నట్లు 50 ఏళ్ల ఈ నటి తెలిపారు. ఈ విరామం వల్ల చాలా మంచి ప్రాజెక్టులు చేజారిపోయినప్పటికీ.. దానికి సంబంధించి తనకెలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు.
ఓటీటీలతో మహిళా ప్రాధాన్యత పెరిగింది
సినిమా థియేటర్ మేకింగ్‌కు, ఓటీటీ కంటెంట్‌కు మేకింగ్ పరంగా ఎలాంటి తేడా లేదని మహీ గిల్ అభిప్రాయపడ్డారు..
కథల ఎంపికలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరగడంతో పాటు, ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతున్నాయి.
స్ట్రీమింగ్ వివరాలు: మహీ గిల్ సరస్వతి దేవిగా వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటున్న రక్తాంచల్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది.

