నెలల తరబడి అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించిన సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5'లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రితేష్ పాల్ విజేతగా నిలిచారు. కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి రితేష్ ఈ సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

'ఇండియా వాలా డ్యాన్స్' థీమ్‌తో సాగిన ఈ సీజన్‌లో భారతీయ నృత్య మూలాలు, పాత తరం బాలీవుడ్ పాటలు, సంప్రదాయ నృత్య శైలులకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. విజయం అనంతరం రితేష్ పాల్, ప్రతీక్ ఉటేకర్ తమ ప్రయాణం, నేర్చుకున్న విషయాలు, ఫిట్‌నెస్, భారతీయ నృత్యం, జడ్జిల నుంచి వచ్చిన సూచనలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' అనిపించుకోవడం చాలా ప్రత్యేకం

టైటిల్ గెలిచిన అనుభూతి గురించి రితేష్ మాట్లాడుతూ.. పేరు, ఫేమ్ కంటే ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే తనకు గొప్ప విజయమని చెప్పారు.

తాను సాధించిన విజయాలను తలపై పెట్టుకోకుండా.. తన లక్ష్యానికి తీసుకెళ్లే మెట్లుగా భావిస్తానన్నారు. దేవాలయానికి వెళ్లేటప్పుడు మెట్లను గౌరవించినట్టే.. తన విజయాలను కూడా తన పాదాల దగ్గర ఉంచుకుని ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు.

రితేష్‌ను గైడ్ చేయడం పెద్ద బాధ్యత: ప్రతీక్

కొరియోగ్రాఫర్‌గా యువ డ్యాన్సర్‌ను మెంటార్ చేయడం చాలా పెద్ద బాధ్యత అని ప్రతీక్ ఉటేకర్ చెప్పారు.

''కొరియోగ్రాఫర్లు ఒక షో నుంచి మరో షోకు వెళ్తుంటారు. కానీ కంటెస్టెంట్‌కు ఒక్క షోనే వారి జీవితాన్ని మార్చగలదు. అందుకే వారికి సరైన దిశ చూపించడం చాలా ముఖ్యం. రితేష్ ఇప్పటికే అద్భుతమైన డ్యాన్సర్. అతనికి సరైన గైడెన్స్ ఇవ్వడానికి నేను అతని కంటే రెండింతలు కష్టపడాల్సి వచ్చింది'' అని తెలిపారు.

ఒక డ్యాన్సర్ ద్వారా స్టేజ్‌పై తన ఆలోచనలు ప్రాణం పోసుకోవడం కొరియోగ్రాఫర్‌కు అత్యంత ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.

డ్యాన్స్ చేస్తే జిమ్ అవసరం లేదంటున్న ప్రతీక్

తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి ప్రతీక్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేస్తూ హెల్తీగా తింటే సహజంగానే ఫిట్‌గా ఉండొచ్చని చెప్పారు.

''డ్యాన్స్ కూడా ఒక అద్భుతమైన వ్యాయామమే. అందుకే ఎప్పుడూ జిమ్‌లోనే సమయం గడపాల్సిన అవసరం లేదు'' అని తెలిపారు.

అయితే రితేష్ తనకంటే ఫిట్టర్ అని ప్రతీక్ సరదాగా చెప్పారు. ముఖ్యంగా కోర్ ఫిట్‌నెస్‌పై రితేష్‌కు మంచి అవగాహన ఉందని.. డ్యాన్స్, ఫిట్‌నెస్ రెండింటినీ అతను చక్కగా బ్యాలెన్స్ చేశాడని తెలిపారు.

'ఇండియా వాలా డ్యాన్స్'.. మూలాల్లోకి వెళ్లిన టీమ్

ఈ సీజన్‌లో భారతీయ నృత్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం తమకు అతిపెద్ద సవాల్‌గా మారిందని ప్రతీక్ చెప్పారు.

తన శిక్షణ ప్రధానంగా కాంటెంపరరీ డ్యాన్స్‌లోనే సాగిందని.. అయితే ఈ సీజన్ కోసం భారతీయ నృత్య మూలాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

''మనం చెట్టు గురించి మాట్లాడతాం.. దాని పండ్లు, పూలు, కొమ్మల గురించి మాట్లాడతాం. కానీ ఆ చెట్టుకు వేర్లు ఎక్కడ ఉన్నాయి? మేము ఆ వేర్ల దగ్గరకు వెళ్లాలనుకున్నాం'' అని ప్రతీక్ చెప్పారు.

80, 90ల నాటి పాటల్లోని అసలైన ఫీల్‌ను నేటి ప్రేక్షకులకు అందించేందుకు ప్రతి వారం ప్రత్యేకంగా రీసెర్చ్ చేసినట్లు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ రూట్స్‌పై రితేష్ గర్వం

తన ప్రయాణంలో ఛత్తీస్‌గఢ్ మూలాలు ఎంతో ముఖ్యమని రితేష్ చెప్పారు. తన రాష్ట్ర సంస్కృతిని డ్యాన్స్ ద్వారా దేశానికి పరిచయం చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు.

''భారత్‌లో ఎంతో టాలెంట్ ఉంది. ఏ నగరం, ఏ ప్రాంతం చిన్నది కాదు. టాలెంట్ ఉండి కష్టపడితే ఎక్కడికైనా వెళ్లొచ్చు'' అని రితేష్ పేర్కొన్నారు.

గీతా మా అంటే నాకు అమ్మలాంటివారు

జడ్జిల్లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందని అడగగా.. గీతా మా, కరిష్మా మేడమ్, జావేద్ సర్, టెరెన్స్ సర్ అందరినీ ప్రేమిస్తానని రితేష్ తెలిపారు. అయితే గీతా మా, టెరెన్స్ సర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

గీతా మా తనకు తల్లిలాంటి వారని చెప్పారు.

షో మధ్యలో గీతా మా తనకు హనుమంతుడి లాకెట్ ఇచ్చారని, ఆ తర్వాత హనుమాన్ చాలీసాను కూడా అందించారని రితేష్ గుర్తుచేసుకున్నారు. ప్రతి శ్లోకానికి అర్థం రాసి ఉన్న హనుమాన్ చాలీసాను మళ్లీ మళ్లీ చదవాలని అనిపిస్తోందన్నారు.

విజయం తర్వాత గీతా మా చెప్పిన మాటలు మర్చిపోలేను

'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5' విజేతగా ప్రకటించిన తర్వాత గీతా మా కాళ్లకు నమస్కరించేందుకు వెళ్లానని రితేష్ తెలిపారు.

అయితే ఆమె వెంటనే తనను పైకి లేపి.. అలా వంగవద్దని చెప్పారన్నారు. జీవితంలో తాను ఇంకా చాలా దూరం వెళ్లాలని, చాలా ఎత్తుకు ఎదగడం తనకు కనిపిస్తోందని గీతా మా చెప్పినట్లు రితేష్ వెల్లడించారు.

ఆ తర్వాత ఇద్దరూ హగ్ చేసుకున్నారని.. ఆ క్షణం ఎంతో ఎమోషనల్‌గా అనిపించిందని తెలిపారు.

'గెలుపు గురించి ఆలోచించొద్దు.. ఈ క్షణాలను ఆస్వాదించు'

ప్రతీక్ టీమ్‌ను మొదటిసారి కలిసినప్పుడు వారు చాలా ఎనర్జిటిక్‌గా, సరదాగా ఉండేవారని రితేష్ చెప్పారు.

తొలి రిహార్సల్‌లో ప్రతీక్ తనకు ఇచ్చిన ఓ సలహా తన ప్రయాణం మొత్తం గుర్తుండిపోయిందన్నారు.

''ఈ మూడు, నాలుగు నెలలను పూర్తిగా ఆస్వాదించు. పెర్ఫార్మెన్స్ గురించి, గెలుపు-ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఈ క్షణాలు మళ్లీ రావు. వాటిని జీవించు.. ప్రేమించు'' అని ప్రతీక్ చెప్పారని రితేష్ వెల్లడించారు.

ఇతర డ్యాన్సర్లపై అసూయ ఉండదు: ప్రతీక్

పోటీ వాతావరణంలో ఇతర కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లపై అసూయ ఎలా ఉండదని అడగగా.. నిజంగా డ్యాన్స్‌ను ప్రేమించే వ్యక్తికి మరో డ్యాన్సర్‌పై అసూయ ఉండదని ప్రతీక్ స్పష్టం చేశారు.

రితేష్ తనతో కాకుండా మరో కొరియోగ్రాఫర్‌తో పెర్ఫార్మ్ చేసినా, అత్యుత్తమంగా డ్యాన్స్ చేస్తే అతడే గెలవాలని తాను కోరుకుంటానన్నారు.

''ఏది బాగుంటే అది బాగుంటుంది. రితేష్ నిజానికి నాకంటే బాగా డ్యాన్స్ చేస్తాడు. నా బలం కాన్సెప్ట్స్, వాటి డిజైన్‌లో ఉంది. నేను ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే దానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తాను'' అని ప్రతీక్ తెలిపారు.

## పాత బాలీవుడ్ పాటల కోసం ప్రత్యేకంగా రీసెర్చ్

ఈ సీజన్‌లో పాత బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేయడం కోసం ప్రత్యేకమైన హోంవర్క్ చేశామని ప్రతీక్ చెప్పారు.

హెలెన్ పాటలు వచ్చినప్పుడు ఆమె డ్యాన్స్, స్టైల్‌ను అధ్యయనం చేశామని.. మీనాక్షి శేషాద్రి పాటలు వచ్చినప్పుడు ఆమె శైలిని పరిశీలించామని తెలిపారు.

''పాటను చూసి దాని కొరియోగ్రఫీని కాపీ చేయడం కాదు. ఆ పాటలోని నెర్వ్ ఏంటి? దాని అసలు సారం ఏంటి? ఆ పాటలోని 'సాల్ట్' ఏంటి? అనేది అర్థం చేసుకోవాలి'' అని ప్రతీక్ వివరించారు.

అదే విధంగా కరిష్మా కపూర్ ముందు ఆమె కుటుంబ వారసత్వానికి సంబంధించిన పాటలను ప్రదర్శించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందన్నారు.

ప్రతి బీట్ కొట్టడమే డ్యాన్స్ కాదు!

ప్రస్తుత తరం డ్యాన్సర్లు ప్రతి బీట్‌ను హిట్ చేయడంపై, ప్రతి మూమెంట్‌ను షార్ప్‌గా చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రతీక్ అభిప్రాయపడ్డారు.

అలా చేస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్‌లోని హార్ట్, సోల్ కొన్నిసార్లు మిస్ అవుతాయని చెప్పారు.

''పాటలోని ఎసెన్స్‌ను అర్థం చేసుకుని హృదయంతో పెర్ఫార్మ్ చేసినప్పుడు మాత్రమే ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాం'' అని తెలిపారు.

'బాలీవుడ్ డ్యాన్స్ అంత ఈజీ కాదు'

బాలీవుడ్ డ్యాన్స్ చాలా సులభమని చాలామంది అనుకుంటారని.. కానీ అది అంత ఈజీ కాదని రితేష్, ప్రతీక్ అభిప్రాయపడ్డారు.

పాటకు తగ్గ మ్యూజిక్, ఎమోషన్, కాలం, క్యారెక్టర్‌ను అర్థం చేసుకుని పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

రితేష్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు ఇదే!

షోకు రాకముందు ప్రతి ఒక్క బీట్‌ను పట్టుకుని డ్యాన్స్ చేయాలని ప్రయత్నించేవాడినని రితేష్ చెప్పారు.

అయితే జడ్జిలు ఇచ్చిన సలహాలతో తన ఆలోచనా విధానం మారిందన్నారు.

''ప్రతి బీట్‌ను క్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆగాలి.. రిలాక్స్ అవ్వాలి.. ఊపిరి తీసుకోవాలి.. ఆ మూమెంట్‌ను జీవించాలి. పది మూమెంట్స్ చేయడం కంటే ఒక ఎక్స్‌ప్రెషన్‌తో ఆగిపోవడం ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వొచ్చు'' అని తనకు నేర్పారని రితేష్ తెలిపారు.

క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలనుంది

భవిష్యత్‌లో భారతీయ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ నేర్చుకోవాలని రితేష్ తన కోరికను వెల్లడించారు.

కథక్ వంటి శాస్త్రీయ నృత్య రూపాలు ఎంతో కష్టమైనవని, వాటికి క్రమశిక్షణ, నిరంతర శిక్షణ అవసరమని చెప్పారు.

రితేష్ క్లాసికల్ డ్యాన్స్‌లో కూడా శిక్షణ తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ప్రతీక్ తెలిపారు. అది అతన్ని మరింత కంప్లీట్ డ్యాన్సర్‌గా, పెర్ఫార్మర్‌గా తీర్చిదిద్దుతుందని అన్నారు.

'ఇప్పుడైతే ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా'

ఇటీవల 'ప్రో ఛత్తీస్‌గఢ్ డ్యాన్సర్' టైటిల్‌తో పాటు ఇప్పుడు 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5' టైటిల్‌ను గెలుచుకున్న రితేష్.. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నారు.

ప్రస్తుతం తాను 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్'గా ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపారు.

కారు గెలిచినా.. డ్రైవింగ్ మాత్రం రాదు!

విజయం తర్వాత తన తల్లిదండ్రుల రియాక్షన్‌ను రితేష్ గుర్తుచేసుకున్నారు. ఫైనల్‌కు తన తల్లిదండ్రులు వచ్చారని, టైటిల్ గెలిచిన వెంటనే తన తల్లి తనను హగ్ చేసుకుని ఏడ్చారని చెప్పారు.

తాను మాత్రం ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఉన్నానన్నారు. నిజంగానే గెలిచామా? క్యాప్, కారు కీ నిజంగానే మనకే వచ్చాయా? అని ప్రతీక్‌ను అడిగానని చెప్పారు.

షోలో కారు గెలిచినా.. తనకు ఇంకా కారు నడపడం రాదని రితేష్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

తనకు మెర్సిడెస్, డిఫెండర్ కార్లు ఇష్టమని.. డ్రీమ్ కార్ విషయానికి వస్తే మాత్రం రోల్స్ రాయిస్ అని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలి: ప్రతీక్

రితేష్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం ఉందని ప్రతీక్ తెలిపారు.

సరైన గైడెన్స్, అవకాశాలు లభిస్తే భారతీయ డ్యాన్స్‌ను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లగలడని చెప్పారు.

'ఏ ప్రాంతం చిన్నది కాదు'

ఛత్తీస్‌గఢ్ ప్రజలకు రితేష్ ప్రత్యేక సందేశం ఇచ్చారు.

''ఏ ప్రాంతం చిన్నది కాదు. మనమంతా భారతీయులమే. మన టాలెంట్‌పై నమ్మకం ఉంచాలి'' అని అన్నారు.

తన రాష్ట్రంలోని జ‌గ్ద‌ల్‌పూర్‌, జలపాతాలు, ప్రకృతి అందాలను ఇంకా పూర్తిగా చూడలేదని.. భవిష్యత్‌లో ఛత్తీస్‌గఢ్‌ను మరింతగా అన్వేషించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఔత్సాహిక డ్యాన్సర్లకు ప్రతీక్ సలహా

డ్యాన్స్‌పై ఆకలి ఉన్నవారు ఆ ఆకలిని ఎప్పటికీ కోల్పోకూడదని ప్రతీక్ అన్నారు.

''మీరు ఏ నగరం నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. భారత్‌లో ఎంతో టాలెంట్ ఉంది. డ్యాన్స్‌పై ఉన్న ఆకలి తగ్గితే మీరు చేరుకోవాలనుకున్న స్థాయికి చేరుకోలేరు. ఒకసారి విజయం సాధించిన తర్వాత కూడా ఆ ఆకలిని కోల్పోవద్దు. నేర్చుకుంటూ ఉండండి.. కష్టపడుతూ ఉండండి.. డ్యాన్స్ చేస్తూనే ఉండండి'' అని ఔత్సాహిక డ్యాన్సర్లకు సూచించారు.

చివరగా అభిమానులకు రితేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయాణం మొత్తం ప్రేమ, మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ.. ''డ్యాన్స్ చేస్తూ ఉండండి.. డ్యాన్స్ ఆనందాన్ని పంచుతూ ఉండండి'' అని కోరారు.

Next Story