Actor Ravi Teja: నటుడిగా నాకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిన చిత్రం.. ఇరుముడిపై రవితేజ
ఇరుముడిపై రవితేజ

Actor Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి, డిస్ట్రిబ్యూటర్లకు జ్ఞాపికలను అందజేశారు. ఈ వేడుకలో కథానాయకుడు రవితేజ మాట్లాడుతూ సినిమా సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. "కెరీర్‌లో హిట్లు, ఫ్లాప్‌లు, యావరేజ్ చిత్రాలు సహజం. కానీ ఇరుముడి మాత్రం ఒక నటుడిగా నాకు అపారమైన గౌరవాన్ని, గొప్ప సంతృప్తిని అందించింది. చిత్ర విజయానికి కారణమైన పూర్తి క్రెడిట్ శివ నిర్వాణకే చెందుతుంది’’ అని పేర్కొన్నారు. తన పనితీరును ప్రశంసిస్తూ శివను పని రాక్షసుడుగా అభివర్ణించారు. కెరీర్‌లో ఎన్నడూ లేనన్ని నైట్ షూటింగ్‌లు ఈ సినిమా కోసమే చేశానని గుర్తు చేసుకున్నారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం చిత్రానికి ప్రాణప్రదంగా నిలిచిందని, డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లోని సంతోషం తనకు మరింత తృప్తినిచ్చిందని తెలిపారు.
తెలుగు ప్రేక్షకులంతా కలిసి ఒకే పండుగలా ఆదరించిన చిత్రం ఇరుముడి అని కొనియాడారు. ఈ కథ కోసం శివ నిర్వాణ పడిన శ్రమను ప్రస్తావిస్తూ, ఇది ఆయన కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. తానే లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కించానో అది నెరవేరిందని దర్శకుడు శివ నిర్వాణ పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాను గుండెలకు హత్తుకుని సొంతం చేసుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల విజయమని కృతజ్ఞతలు తెలిపారు.

