‘Irumudi’: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా ప్రారంభంలో పెద్దగా అంచనాలను పెంచకపోయినప్పటికీ, విడుదలయ్యాక థియేటర్లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. తమ రెగ్యులర్ శైలికి భిన్నంగా రొమాంటిక్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ మరియు మాస్ హీరో రవితేజ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, 'ఇరుముడి' చిత్రం మొదటి వీకెండ్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రం ఉత్తర అమెరికా (North America) మార్కెట్‌లో మొదటి వారంలోనే $1 మిలియన్ మార్కును దాటి రికార్డు సృష్టించింది. రవితేజ కెరీర్‌లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద తొలి వీకెండ్‌లో దాదాపు రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఆదివారం నాడు అతిపెద్ద డిమాండ్‌ను నమోదు చేస్తూ, మూడో రోజు రూ. 21 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్‌లోనే అత్యధిక మొదటి వారం కలెక్షన్లుగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును సులువుగా దాటనుంది.

వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు ఈ చిత్రం ఊరటనివ్వడమే కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే మాస్ రాజా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story