AishwaryaRai: భారతీయ కుటుంబ విలువలకు, పాశ్చాత్య జీవన విధానానికి ఉన్న తేడాను ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ సమర్థవంతంగా వివరించిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ తల్లిదండ్రులతో కలిసి ఉండటంపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

పాశ్చాత్య సంస్కృతిపై ఆశ్చర్యం

అమెరికా వంటి దేశాల్లో యుక్తవయస్సు రాగానే పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరుపడి ఒంటరిగా జీవించడాన్ని ఐశ్వర్య ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. "యువత ఇల్లు వదిలి వెళ్లిపోవడం అక్కడ ఒక తప్పనిసరి సామాజిక నియమమా? అందరూ అలా ఎందుకు వేరుగా వెళ్లిపోవాలో నాకైతే అర్థం కావడం లేదు" అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 30 ఏళ్లు దాటిన విజయవంతమైన పాశ్చాత్య మహిళలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. భారతీయ జీవనశైలిలోని గొప్పదనాన్ని ఆమె ప్రస్తావించారు.

కలిసి తినే భోజనమే మాకు అత్యంత విలువైనది

గ్లోబల్ స్టార్‌గా నిరంతరం షూటింగులు, ప్రయాణాలతో బిజీగా ఉండే ఐశ్వర్య, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రయాణాల వల్ల కుటుంబంతో గడిపే సమయం తనకు చాలా తక్కువగా దొరుకుతుందని, అలాంటి సందర్భాల్లో ఇంట్లో అందరితో కలిసి చేసే భోజనాన్ని తాము ఎంతో పవిత్రంగా, విలువైనదిగా భావిస్తామని తెలిపారు. తాను ఆర్థికంగా, వ్యక్తిగతంగా పూర్తి స్వేచ్ఛ గల వ్యక్తినని చెబుతూనే.. "తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టడమే నిజమైన స్వాతంత్ర్యానికి నిదర్శనమని నేను ఏమాత్రం నమ్మను" అని ఐశ్వర్య కుండబద్దలు కొట్టారు.

-గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగినా.. మూలాలను మరువని వైనం

1994లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యారాయ్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగి, అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై క్రమం తప్పకుండా మెరుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. భారతీయ మూలాలు, సంస్కృతిపై ఆమె చూపిన గౌరవం ఇప్పుడు మళ్లీ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

Next Story