Pawan Kalyan’s Real Name: పవన్ కల్యాణ్ అసలు పేరు అది కాదా? పవర్ స్టార్ పేరు వెనుక ఉన్న అసలు కథ ఇదీ..
పవర్ స్టార్ పేరు వెనుక ఉన్న అసలు కథ ఇదీ..

Pawan Kalyan’s Real Name: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన నడక, నటన, స్టైల్, మాట్లాడే తీరు.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఆయనే టాలీవుడ్ ‘పవర్ స్టార్’, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. అయితే, మనందరికీ తెలిసిన పవన్ కల్యాణ్ పేరు ఆయన అసలు పేరు కాదు. మరి ఆ పేరు ఆయనకు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? అనే విశేషాలను పవన్ కల్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
బారసాల రోజు పెట్టిన పేరు వేరు..
పవన్ కల్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన పుట్టినప్పుడు కుటుంబ సభ్యులు బారసాల రోజు పెట్టిన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్. ఆ తర్వాత స్కూల్లో జాయిన్ చేసే సమయానికి పేరులోని శ్రీ అనే పదాన్ని తొలగించి, కేవలం కె. కల్యాణ్ కుమార్ అని మార్చారు. గతంలో ఆయన తల్లి అంజనా దేవి కూడా ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు అసలు పేరు కల్యాణ్ కుమార్ అని ధృవీకరించారు.
కల్యాణ్ కుమార్ కాస్తా పవన్ కల్యాణ్ ఎలా అయ్యారు?
కల్యాణ్ కుమార్ అనే పేరు 'పవన్ కల్యాణ్'గా మారడం వెనుక ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉంది.
"నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే విపరీతమైన పిచ్చి. వాటిని నేర్చుకునే రోజుల్లో చాలా కఠినమైన విన్యాసాలు చేసేవాడిని. ఎంతలా అంటే.. నా ఛాతీపై వందల కిలోల బరువున్న బండరాళ్లను పెట్టుకుని, వాటిని సుత్తితో పగలగొట్టించేవాడిని. నా శారీరక దృఢత్వాన్ని, విద్యపై నాకున్న అంకితభావాన్ని చూసి.. నా మార్షల్ ఆర్ట్స్ గురువు నా పేరుకు ముందు 'పవన్' అనే పదాన్ని చేర్చారు" అని పవన్ కల్యాణ్ వివరించారు. అలా గురువు ఇచ్చిన పవన్ అనే పేరునే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్నారు. అదే పేరు కాలక్రమేణా టాలీవుడ్‌లో ఒక పెను తుపాను సృష్టించింది. ఆ తర్వాత ఆయన క్రేజ్ చూసి అభిమానులు ఇచ్చిన 'పవర్ స్టార్' అనే బిరుదు ఆయన పర్సనాలిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది.
మెగాస్టార్ తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం వరకు..
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. కేవలం నటుడిగానే కాకుండా రైటర్, సింగర్, స్టంట్ డిజైనర్, డైరెక్టర్.. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని, పవన్ ఇజంను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్నారు.

