Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్‌ను వీడనున్న సల్మాన్ ఖాన్? బాంద్రాలో 6 అంతస్తుల కొత్త కోట
బాంద్రాలో 6 అంతస్తుల కొత్త కోట

Salman Khan: బాలీవుడ్ సుల్తాన్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబయిలో సరికొత్త ఆశ్రయానికి సిద్ధమవుతున్నారు. ముంబయిలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన బాంద్రాలో సరికొత్తగా ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునేందుకు ఖాన్ కుటుంబానికి లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA) జూన్ 16న ఈ భవన నిర్మాణానికి అన్ని రకాల పర్యావరణ అనుమతులు జారీ చేసింది.
సల్మాన్ ఖాన్ తల్లి 'సల్మా ఖాన్' పేరు మీద ఉన్న ఈ స్థలం.. బాంద్రాలోని చింబాయ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని కూల్చేసి.. గ్రౌండ్ ప్లస్ స్టోరేజ్, స్టిల్ట్ పార్కింగ్,6 అంతస్తులతో ఈ సరికొత్త సీ-ఫేసింగ్ (Sea-facing) బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. దాదాపు 1,014 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాచ్ డెవలపర్స్ (Sach Developers) దీనిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న చెట్లను నరకకూడదని, చుట్టుపక్కల మరిన్ని స్థానిక మొక్కలను నాటాలని అధికారులు గట్టి షరతులు విధించారు.
అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 1974 నుంచి, అంటే దాదాపు 52 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ కుటుంబం బాంద్రాలోని ప్రసిద్ధ 'గెలాక్సీ అపార్ట్మెంట్స్'లోనే నివసిస్తోంది. ప్రతి ఈద్ పండుగకు, పుట్టినరోజుకు సల్మాన్ ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచే లక్షలాది మంది అభిమానులకు అభివాదం చేయడం ఒక ఆనవాయితీ. మరి అంతటి అనుబంధం ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్స్‌ను సల్మాన్ ఖాళీ చేస్తారా? లేదా? అనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.
కానీ ఈ కొత్త ఇంటి నిర్ణయం వెనుక బలమైన భద్రతా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గెలాక్సీ అపార్ట్మెంట్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు జరిపిన కాల్పుల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బాల్కనీని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో క్లోజ్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కు పోలీసులు వై ప్లస్ (Y+) కేటగిరీ భారీ భద్రతను కల్పించారు.
ప్రస్తుతం నివసిస్తున్న అపార్ట్మెంట్ ప్రధాన రహదారిపై ఉండటంతో భద్రత పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. కానీ, కొత్తగా నిర్మించబోయే ఇల్లు ఒక ప్రశాంతమైన, ఇరుకైన సందులో (By-lane) ఉండటం వల్ల.. భద్రతా బలగాలకు నిఘా పెట్టడం చాలా సులువవుతుంది. ప్రైవసీతో పాటు హై-సెక్యూరిటీ ఉండేలా, దాదాపు 15 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో ఈ ఇల్లు రూపుదిద్దుకుంటోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న వరుస బెదిరింపుల నేపథ్యంలోనే సల్మాన్ కుటుంబం ఈ సరికొత్త ఇంటికి మారే యోచనలో ఉన్నట్లు బాలీవుడ్ సమాచారం.

