Ashika Ranganath: కన్నడ పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార ఆషికా రంగనాథ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కొత్త సినిమాల విశేషాలు, సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం ఆషికా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో 'సర్దార్ 2' ఒకటి. తన కెరీర్‌లోనే తొలిసారిగా యాక్షన్ స్పై థ్రిల్లర్ జానర్‌లో నటిస్తున్నానని, ఇందులో తన పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు. కార్తి, ఎస్.జె. సూర్యలతో కలిసి నటించిన అనుభవాన్ని పంచుకుంటూ.. హీరో కార్తికి సినిమాపై ఉన్న ప్యాషన్, ఎంత పెద్ద స్టార్‌గా ఉన్నప్పటికీ ఆయనలోని అణకువ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు.

ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తుండటం తన జీవితంలో ఒక మరువలేని అనుభూతిగా ఆషికా పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి పాటలు వింటూ, ఆయన డ్యాన్సులు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు నేరుగా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సెట్స్‌లో మెగాస్టార్ పంచుకునే విలువైన అనుభవాలు నటులందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. అంతేకాకుండా, ఇదే సెట్స్‌లో నటి త్రిషను కలవడం తనకో అద్భుతమైన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని సంతోషంగా గుర్తుచేసుకున్నారు.

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీ తనకు సొంత ఇల్లు లాంటిదని, ఉదయం ఇంటి భోజనం తింటూ షూటింగ్‌కు వెళ్లడం ఎంతో ఇష్టమని చెప్పారు. మొదట్లో భాష రాకపోవడం వల్ల వేరే ఇండస్ట్రీకి వెళ్లేందుకు భయపడి కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోయానని, కానీ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’, కార్తి ‘సర్దార్ 2’ చిత్రాలతో పాటు.. ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ నిర్మాణంలో ఒక సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్రీవిష్ణు సరసన మరో చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తమిళంలోనూ రొటీన్‌కు భిన్నమైన విభిన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని ఆషికా రంగనాథ్ చెప్పుకొచ్చారు.

Next Story