Rajamouli: కేవలం టైమ్ ట్రావెల్ మాత్రమే కాదు.. వారణాసి అసలు కథ అదే.. రాజమౌళి రివీల్..
రాజమౌళి రివీల్..

Rajamouli: గ్లోబల్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమా కథా నేపథ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలకు తాజాగా జక్కన్న స్వయంగా పుల్‌స్టాప్ పెట్టారు. ఈ చిత్రం సాధారణ టైమ్ ట్రావెల్ కథ మాత్రమే కాదని, ఊహకందని భారీ సాహస యాత్రతో కూడిన బలమైన భావోద్వేగాల ప్రయాణమని స్పష్టం చేశారు.
అంటార్కిటికా నుంచి పురాణ యుగం దాకా..
ఇటీవల బ్రెజిలియన్ మీడియాతో మాట్లాడిన రాజమౌళి, ఈ ప్రాజెక్ట్ తాలూకు విస్తృతిని వివరిస్తూ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ప్రపంచాల మధ్య సాహసం:
కథ ఒకే చోట ఆగదని, మంచు ఖండం అంటార్కిటికా నుంచి ఆఫ్రికా అడవుల మీదుగా పవిత్ర వారణాసి నగరం వరకు ఈ సాహస యాత్ర సాగుతుంది.
పౌరాణిక యుగం - భారీ జీవులు
ఆధునిక కాలం మాత్రమే కాకుండా సినిమా వివిధ యుగాల్లోకి, ముఖ్యంగా పురాణ కాలంలోకి కూడా ప్రయాణిస్తుంది. అక్కడ భారీ పరిమాణంలో ఉండే జీవులు, దైవిక అంశాలు ప్రేక్షకులను సరికొత్త విజువల్ వండర్‌లో ముంచెత్తుతాయి.
గ్లింప్స్ ఉద్దేశం:
కేవలం మాటల్లో చెబితే అర్థం కాని ప్రపంచాన్ని, ప్రేక్షకులు అనుభూతి చెందబోయే విజువల్స్‌ను పరిచయం చేయడానికే గతంలో గ్లింప్స్ రిలీజ్ చేసినట్లు తెలిపారు.
అసలు గుండెకాయ.. తండ్రీకొడుకుల సెంటిమెంట్
విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్, యుగాల ప్రయాణం వంటి భారీ హంగులు ఉన్నప్పటికీ.. ఈ కథను నడిపించే ప్రధాన చోదక శక్తి మాత్రం తండ్రీకొడుకుల బంధం అని రాజమౌళి స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఉండే బలమైన ప్రేమ, ఎమోషన్సే ఈ అడ్వెంచరస్ స్టోరీకి మూలస్తంభాలని పేర్కొన్నారు.
స్టార్ కాస్ట్ వివరాలు
ఈ విజువల్ వండర్‌లో మహేశ్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ మందాకినిగా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి తాజా ప్రకటనతో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో హైప్ మరింత తారాస్థాయికి చేరింది.

