సంచలన వ్యాఖ్యలు..

Jagapathi Babu: సినిమాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి.. వాళ్లు నాశనం అయిపోవాలనే కక్షపూరిత విమర్శలు వద్దు. అందరం పాజిటివ్‌గా ఉండి ఇండస్ట్రీని కాపాడుకుందాం" అంటూ సీనియర్ నటుడు జగపతిబాబు ఇండస్ట్రీలోని ట్రోలింగ్ కల్చర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగపతిబాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం వదలా.
ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జగపతిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నిజానికి ఈ సినిమాను 20 రోజుల క్రితమే విడుదల చేయాల్సింది, కానీ అవుట్‌పుట్ మరింత మెరుగ్గా రావడం కోసమే వాయిదా వేశాం. ఈ సినిమాను ఎవరూ ట్రోల్ చేయరని నమ్ముతున్నా.. ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు అంటూ నవ్వులు పూయించారు.
కొన్ని సినిమాలను కావాలనే టార్గెట్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఇండస్ట్రీ నష్టపోతుందని జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకలో హీరోయిన్ లయ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో చిత్ర బృందం తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుందని, 'వదలా' అనే టైటిల్, కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లయింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ, హిందీ డబ్బింగ్ రైట్స్ లాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సి వస్తోంది. గతంలో ఆరు నెలల్లో పూర్తయ్యే సినిమాలు.. ఇప్పుడు పూర్తి కావడానికి మూడేళ్లు ఎందుకు పడుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు" అంటూ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

