Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న జగపతి బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. తన వ్యక్తిగత విశేషాలను, సరదా ఘట్టాలను సెల్ఫ్ ట్రోల్, సెటైరికల్ వ్యాఖ్యలతో పంచుకోవడం ఆయన శైలి. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఆయన చేసిన వంటకం కంటే, ఆయన ముఖంపై కనిపించిన గాయాలే అభిమానులను ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురిచేసాయి.

కుకీల తయారీ వీడియో

తన పెద్ద కుమార్తె దగ్గర నేర్చుకున్న చాక్లెట్ చిప్ కుకీస్ రెసిపీని అభిమానులకు చూపిస్తూ జగపతి బాబు ఈ వీడియోను రూపొందించారు. తనదైన మార్క్ హాస్యంతో వంటకాన్ని వివరిస్తూ ఆకట్టుకున్నారు. వీడియోలో ఆయన ముఖంపై, ముఖ్యంగా రెండు కళ్ల కింద స్పష్టమైన గాయాలు, మచ్చలు కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా కంగారుపడి, కామెంట్ల రూపంలో ఆరా తీయడం మొదలుపెట్టారు.

సర్జరీపై సరదాగా స్పష్టత ఇచ్చేసిన జగ్గుభాయ్:

అభిమానుల సందేహాలను, టెన్షన్‌ను ముందే గ్రహించిన జగపతి బాబు వీడియో ఆరంభంలోనే ఈ విషయంపై స్పందించారు. "నా ముఖం చూసి ఎవరో వచ్చి పగలగొట్టారని అనుకుంటున్నారా? నన్నెవరూ ఏమీ చేయలేదు. చిన్న సర్జరీ చేయించుకున్నాను అంతే. ప్రస్తుతం బాగానే ఉన్నాను, ఎవరూ కంగారు పడకండి" అని చిరునవ్వుతో క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన..

ఆయన ఏ రకమైన సర్జరీ చేయించుకున్నారు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ఎంత సీరియస్ విషయాన్నైనా ఎంతో తేలికగా, హాస్యస్ఫోరకంగా చెప్పి అభిమానులకు ధైర్యం చెప్పిన ఆయన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ "టేక్ కేర్ సర్, త్వరగా కోలుకోండి" అంటూ కామెంట్లు పెడుతుండటంతో ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story