Jailer 2: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన యాక్షన్‌ విందు జైలర్‌ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.209.10 కోట్ల గ్రాస్‌ రాబట్టి సరికొత్త మైలురాయిని అధిగమించింది.

రెండు రోజుల్లో రూ.95 కోట్ల నెట్ వసూళ్లు

సాక్‌నిల్క్‌ నివేదికల ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో ఈ సినిమా రెండో రోజైన శుక్రవారం రూ.35.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తొలి రోజు రూ.59.70 కోట్లు రాబట్టగా, రెండో రోజు వసూళ్లలో దాదాపు 40.4 శాతం మేర తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, రెండు రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా నెట్‌ వసూళ్లు రూ.95.30 కోట్లకు (గ్రాస్‌ రూ.112.10 కోట్లు) చేరడం విశేషం. ఇక ఓవర్సీస్‌లోనూ రజనీ హవా కొనసాగుతుండటంతో విదేశాల నుంచి రూ.97 కోట్ల గ్రాస్ నమోదైంది.

భాషల వారీగా కలెక్షన్లు

రెండో రోజు మార్కెట్‌లో తమిళ వెర్షన్‌ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది:

తమిళం: 7,243 షోల ద్వారా రూ.25.25 కోట్ల నెట్

తెలుగు: 1,940 షోల ద్వారా రూ.7.25 కోట్ల నెట్

హిందీ: రూ.2.75 కోట్ల నెట్

కన్నడ: రూ.35 లక్షల నెట్

వీకెండ్‌పైనే అందరి చూపు

రెండో రోజు థియేటర్లలో మొత్తం ఆక్యుపెన్సీ 48.2 శాతంగా ఉండగా, తమిళ వెర్షన్ నైట్ షోలకు గరిష్టంగా 85.92 శాతం ఆక్యుపెన్సీ లభించింది. రెండు రోజుల్లో దాదాపు 61.30 లక్షల మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించారు. వర్కింగ్ డే కావడంతో రెండో రోజు కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించినా, శని, ఆదివారాల్లో భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

సన్‌ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ గా మరోసారి మెప్పించగా.. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, విద్యాబాలన్‌, రమ్యకృష్ణన్‌, ఎస్‌.జె. సూర్య, మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. హృతిక్‌ రోషన్‌ ప్రత్యేక పాత్ర, అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Next Story