‘Jana Nayagan’: జన నాయగన్ సీన్లు లీక్: తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

‘Jana Nayagan’: కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జన నాయగన్ చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
సమష్టి కృషిని దెబ్బతీయడమే:
సినిమా లీక్ కావడంపై చిరంజీవి తీవ్రంగా స్పందించారు. "ఎంతో మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి, మరెన్నో కలల కలయికే ఒక సినిమా. 'జన నాయగన్' చిత్రానికి జరిగిన ఈ లీకేజీ నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది కేవలం ఒక చిత్రానికి సంబంధించిన విషయం కాదు, పరిశ్రమలోని ప్రతి ఒక్కరి సృజనాత్మకతను దెబ్బతీసే చర్య" అని ఆయన పేర్కొన్నారు.
నిర్మాణ సంస్థకు మెగా మద్దతు
ఈ క్లిష్ట సమయంలో సినిమాను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ కు తాను అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. పైరసీని అరికట్టడంలో, దోషులను పట్టుకోవడంలో చిత్ర బృందానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
లీకుల కలకలం:
జన నాయగన్ మూవీలోని కీలకమైన సీన్లు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవ్వడంపై చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. సినిమాను కాపాడుకోవడానికి, కళను గౌరవించడానికి అందరూ ఏకమవ్వాలని చిరంజీవి పిలుపునిచ్చారు. "పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం" అనే నినాదంతో చిరంజీవి తన పోస్ట్‌ను ముగించారు.

