బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం మేఘాలయ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడ, మేఘాలయ ప్రకృతి అందాలు, అక్కడ నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ అకాడమీ మరియు భారతదేశం పట్ల తనకున్న ప్రేమ గురించి జాన్ అబ్రహం పంచుకున్న ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...



మేఘాలయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా మీ అనుభవం ఎలా ఉంది?

జాన్ అబ్రహం : మేఘాలయ వంటి అద్భుతమైన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. భారతదేశంలో ఇంకా పూర్తిగా అన్వేషించని అత్యంత అందమైన ప్రాంతాలలో మేఘాలయ ఒకటి. గత 14 ఏళ్లుగా ఫుట్‌బాల్ కారణంగా నేను మేఘాలయకు వెళ్తున్నాను. అక్కడి ప్రజల ఆప్యాయత, ప్రకృతి దృశ్యాలు నన్ను కట్టిపడేశాయి.

మొదటిసారి మేఘాలయ వెళ్లేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి?

జాన్ అబ్రహం : గౌహతి విమానాశ్రయంలో దిగిన తర్వాత రోడ్డు మార్గంలో షిల్లాంగ్ వెళ్లే దారిలో ఉమియమ్ లేక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేఘాలయ అంటే కేవలం ఒకే ప్రదేశం కాదు.. అదొక గొప్ప అనుభవం. అక్కడి ఆహారం, సంగీతం, సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా అక్కడ జరిగే 'చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్' మ్యూజిక్ లవర్స్‌కు ఒక పండగలా ఉంటుంది. అక్కడి ప్రజలకు సంగీతం, ఫ్యాషన్ పట్ల మంచి అవగాహన ఉంది.

నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ & ఫుట్‌బాల్ అకాడమీ విశేషాలు ?

జాన్ అబ్రహం : మేఘాలయ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. న్యూ షిల్లాంగ్‌లో ప్రభుత్వం మాకు 20 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ ఒక ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ అకాడమీని నిర్మిస్తున్నాం. నా సోదరుడు ఆర్కిటెక్ట్ కావడంతో, అతనే ఈ అకాడమీని డిజైన్ చేస్తున్నాడు (నవ్వుతూ.. నా దగ్గర ఫీజు తీసుకోకుండానే!).

40,000 సామర్థ్యంతో స్టేడియం : అకాడమీకి కేవలం 500 మీటర్ల దూరంలోనే 40,000 మంది కూర్చునే సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం 70-80% పూర్తయింది.

భవిష్యత్తు లక్ష్యం : రాబోయే ఏడాదిన్నరలో ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులు పూర్తి చేసి, దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు మరియు మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల జట్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. క్రికెట్‌కు ఉన్నట్లే ఫుట్‌బాల్‌ను కూడా యువతకు ఒక మంచి కెరీర్‌గా మార్చాలన్నదే నా కల.

మేఘాలయను ఇతర పర్యాటక ప్రాంతాల కంటే భిన్నంగా నిలబెట్టే అంశం ఏమిటి?

జాన్ అబ్రహం : పరిశుభ్రత! మేఘాలయ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం. అక్కడి నదుల్లో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే, నీటి అడుగున ఉన్న మన పాదాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే శాకాహారులు, వీగన్లకు కూడా అక్కడ అద్భుతమైన కేఫ్ కల్చర్, రుచికరమైన ఆహారం అందుబాటులో ఉన్నాయి.

ఫిట్‌నెస్ మరియు సినిమాల గురించి?

జాన్ అబ్రహం : ఆరోగ్యంగా ఉండటం అనేది జీవితంలో ఒక దశ కాదు, అదొక జీవనశైలి కావాలి. నా జీవనశైలికి విరుద్ధంగా ఉండే ఎలాంటి ఉత్పత్తులను నేను ప్రమోట్ చేయను. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం కొన్ని చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాను. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తాను.

మేఘాలయ పర్యాటక రంగానికి కొత్త హంగులు (పర్యాటక శాఖ ప్రతినిధుల వివరాలు) :

అనుభవపూర్వక పర్యాటకం : ఉమియమ్, జోన్షా మరియు సకల గోమా ప్రాంతాల్లో 250 లగ్జరీ గదులు, రెయిన్ ఫారెస్ట్ క్యాంపింగ్ మరియు కేవింగ్ వంటి సాహసోపేత అనుభవాలను సిద్ధం చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ : పర్యాటకుల రద్దీ వల్ల ప్రకృతి దెబ్బతినకుండా స్థానిక కమ్యూనిటీల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం మరియు కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో 'క్యారీయింగ్ కెపాసిటీ' (పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకులను అనుమతించడం) నిబంధనలను అమలు చేస్తున్నారు.

మెట్రో నగరాలపై దృష్టి : ప్రస్తుతం ఏటా 18 లక్షల మంది పర్యాటకులు మేఘాలయను సందర్శిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుండి మరిన్ని నేరుగా విమాన సర్వీసులు పెంచేందుకు షిల్లాంగ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ పనులు జరుగుతున్నాయి.

"కేవలం ఫోటోలలో చూడటమే కాదు.. ఒక్కసారి మేఘాలయకు రండి, అక్కడి ప్రకృతిని, సంగీతాన్ని, ఫుట్‌బాల్ వాతావరణాన్ని స్వయంగా ఆస్వాదించండి" అంటూ జాన్ అబ్రహం పర్యాటకులకు పిలుపునిచ్చారు.

Next Story