Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ’, ‘రామాయణ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే, తల్లి అయ్యాక సినిమాలు ఎంపిక చేసుకునే విధానంలో తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని కాజల్ తాజాగా వెల్లడించారు. తన కుమారుడు నీల్ పుట్టిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా.. తన కొడుకు దృష్టి నుంచే ఆలోచిస్తున్నట్లు కాజల్ చెప్పారు. "భవిష్యత్తులో మా అమ్మ చేసిన గ్రేట్ సినిమా ఇది అని నీల్ గర్వంగా చెప్పుకోవాలి. అందుకే కథల ఎంపికపై నాకు బాధ్యత, అవగాహన పెరిగాయి" అని ఆమె అన్నారు. అంతేకాదు, తన కొడుకు నీల్‌కు రామాయణం అంటే ఎంతో ఇష్టమని, ఇంట్లో రోజూ రామలీలా చూస్తాడని తెలిపారు. ఈ సినిమాలో తాను 'మండోదరి' పాత్రలో నటిస్తున్నానని చెప్పగానే వాడు ఎంతో ఉత్సాహపడ్డాడని కాజల్ మురిసిపోతూ చెప్పారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నీల్‌కు రామాయణంలో అత్యంత ఇష్టమైన పాత్ర 'రావణుడు' అంట! ఈ సినిమా పార్ట్ 2 వచ్చేసరికి నీల్‌కు ఐదేళ్లు వస్తాయని, థియేటర్లో వాడు చూసే మొదటి సినిమా ఇదే అవుతుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు, చేతన్ డీకే దర్శకత్వంలో కాజల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. జులై 24న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్ న్యాయవాది (లాయర్) పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథ తనను ఎంతో ఆలోచింపజేసిందని కాజల్ తెలిపారు. పురుగు మందుల వాడకం వల్ల జరిగే నష్టాలు, కల్తీ ఆహారం ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది అనే సామాజికాంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన రీసెర్చ్‌తో తనకు కల్తీ ఆహారంపై పూర్తి అవగాహన వచ్చిందని, ఆ వెంటనే తన వంటగదిలో ఏ వస్తువులు ఉంచాలి, తన కొడుకు నీల్‌కు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదో అప్పటికప్పుడే నిర్ణయించుకున్నానని కాజల్ చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story