Kalki OTT Controversy: కల్కి ఓటీటీ వివాదం.. ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు తొలగింపుపై ఫ్యాన్స్ ఫైర్
ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు తొలగింపుపై ఫ్యాన్స్ ఫైర్

Kalki OTT Controversy: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం కల్కి 2898 ఏడీ చుట్టూ మరో కొత్త వివాదం రాజుకుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వెర్షన్‌లోని ఎండ్ క్రెడిట్స్ నుంచి హీరోయిన్ దీపికా పదుకొణె* పేరును తొలగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో కల్కి 2898 ఏడీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమా చివర్లో వచ్చే నటీనటుల జాబితాలో కీలక పాత్ర పోషించిన దీపిక పేరు కనిపించకపోవడాన్ని అభిమానులు గమనించారు.
దీపికా పేరుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు."సినిమాలో అంత కీలకమైన పాత్ర పోషించిన హీరోయిన్ పేరును తొలగించడం వృత్తిధర్మానికి విరుద్ధం. ఇది చిన్నపిల్లల చేష్ట" అంటూ నిర్మాతల తీరును విమర్శించారు. ఎండ్ క్రెడిట్స్ ప్లే అవుతున్న సమయంలో తెరపై దీపిక కనిపించినా, జాబితాలో పేరు లేకపోవడం గమనార్హం.
సీక్వెల్ వివాదమే కారణమా?
ఈ వివాదం వెనుక ఇటీవల జరిగిన ఓ పరిణామం కారణంగా ఉందని సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కల్కి సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పారితోషికం పెంపు, పని గంటల తగ్గింపు వంటి డిమాండ్ల వల్లే ఆమెను తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ నుంచి కూడా పేరు తొలగించడంతో, నిర్మాతలు కక్షపూరితంగా ఈ చర్య తీసుకున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్న సమయంలోనే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మీడియా సంస్థలు, అభిమానులు తాజాగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలోని ఎండ్ క్రెడిట్స్‌ను తనిఖీ చేయగా, అందులో ప్రస్తుతం దీపికా పదుకొణె పేరు కనిపిస్తున్నట్లు నిర్ధారించారు. మొదట పేరు లేకపోవడం సాంకేతిక లోపమా, లేక విమర్శలు వెల్లువెత్తడంతో మేకర్స్ దాన్ని హుటాహుటిన సరిదిద్దారా? అనే దానిపై మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

