Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ నటించనున్న తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి సండియార్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

రెండు దశాబ్దాల పాత టైటిల్.. అసలు కథేంటి?

సండియార్ అనే పేరు వెనుక కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గతం ఉంది. 2004లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ విరుమాండి చిత్రానికి తొలుత సండియార్ అనే పేరునే నిర్ణయించారు. అయితే ఆ సమయంలో కొన్ని రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, వివాదాలు చెలరేగడంతో వివాదాలకు తావివ్వకూడదని భావించి ఆ టైటిల్‌ను విరుమాండిగా మార్చారు. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత, కమల్ హాసన్ మళ్లీ అదే పాత టైటిల్‌ను తన తాజా చిత్రానికి అధికారికంగా ఖరారు చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రక్తం, రివాల్వర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఫస్ట్‌లుక్

పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. పోస్టర్‌లో కమల్ హాసన్ కారు కిటికీలోంచి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఎంతో గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. కారు డోర్‌పై రక్తపు మరకలు కనిపిస్తుండటంతో, ఈ చిత్రం పూర్తిస్థాయి ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని స్పష్టమవుతోంది.

క్రేజీ టెక్నికల్ టీమ్

కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ టేకింగ్, అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్, అన్బరివ్ యాక్షన్ కలయికలో రానున్న సండియార్ కమల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story