Kangana Ranaut’s Sensational Remark: రెహమాన్‌పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut’s Sensational Remark: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల 'ఛావా' సినిమాపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'ఛావా' విభజనను ప్రోత్సహించే చిత్రమని, ఆ విభజనను క్యాష్ చేసుకున్నప్పటికీ అందులో శౌర్యాన్ని ప్రదర్శించడమే ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై నటి కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన దర్శకత్వంలో వచ్చిన 'ఎమర్జెన్సీ' సినిమాకు సంగీతం అందించమని రెహమాన్‌ను కోరినప్పుడు, ఆయన కనీసం తనను కలవడానికి కూడా నిరాకరించారని కంగనా వెల్లడించారు.
రెహమాన్ గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ, "నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందున పరిశ్రమలో ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నాను, కానీ మీకంటే ఎక్కువ ద్వేషం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు" అని కంగనా ఘాటుగా విమర్శించారు. 'ఎమర్జెన్సీ' సినిమా ఒక ప్రచార చిత్రం అని భావించి ఆయన తనను కలవలేదని, కానీ విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు సైతం ఆ సినిమాను అద్భుతమని మెచ్చుకున్నారని ఆమె పేర్కొన్నారు. రెహమాన్ ద్వేషంతో గుడ్డివాడైపోయారని, ఆయనను చూస్తే జాలి వేస్తోందని ఆమె తన పోస్ట్‌లో రాశారు.
అయితే రెహమాన్ తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తన ఉద్దేశాలను కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారని, ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని ఆయన ఒక వీడియోలో తెలిపారు. సంగీతం ఎప్పుడూ దేశ సంస్కృతిని గౌరవించడానికి, ప్రజలను అనుసంధానించడానికేనని ఆయన స్పష్టం చేశారు. కంగనా చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

