Kantara Controversy: కాంతార వివాదం..సారీ చెప్పిన రణ్ వీర్
సారీ చెప్పిన రణ్ వీర్

Kantara Controversy: కాంతార సినిమా వివాదంపై బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తన ఇన్ స్టాగ్రమ్ లో క్షమాపణలు చెప్పారు.నా ఉద్దేశం రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే. ఒక నటుడిగా, ఆ సన్నివేశంలో ఆయన ఎంత కష్టపడారో నాకు తెలుసు. దాని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఎల్లప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతిని, సంప్రదాయాన్ని, విశ్వాసాన్ని గౌరవిస్తాను. ఎవరి మనోభావాలను నేను బాధించి ఉంటే, నేను చిత్తశుద్ధితో క్షమాపణలు కోరుతున్నాను" అని ఆయన తెలిపారు.
ఈ వివాదం ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల సందర్భంగా తలెత్తిన సంగతి తెలిసిందే. రణ్ వీర్ సింగ్ వేదికపై 'కాంతార చాప్టర్ 1' సినిమాలోని దైవ నర్తక (దైవ ఆవహించిన) సన్నివేశాన్ని అనుకరించి చూపించారు. దైవ నర్తక పాత్రను ప్రస్తావిస్తూ హీరో పాత్రలోకి ఆడ దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయి" అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు, అనుకరణ పట్ల కన్నడ ప్రేక్షకులు, ముఖ్యంగా తీరప్రాంత కర్ణాటకకు చెందిన వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవాలను (అంటే పవిత్రమైన అటవీ దేవతలను) 'దెయ్యం' అని పిలవడం , ఆ పవిత్ర నృత్యాన్ని హాస్యంగా అనుకరించడం తమ సంస్కృతిని, మత విశ్వాసాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ జన జాగృతి సమితి (HJS) వంటి సంస్థలు గోవా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. ఈ క్రమంలో విమర్శలు తీవ్రం కావడంతో, రణ్ వీర్ సింగ్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా క్షమాపణలు తెలియజేశారు.

