ఈడీ ఛార్జ్‌షీట్‌లో రన్యా రావు పేరు

Gold Smuggling Scam: అక్రమ బంగారు రవాణా కేసులో ఇప్పటికే అరెస్టైన కన్నడ సినీ నటి రన్యారావు మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంది. రూ.102 కోట్ల విలువైన బంగారు స్మగ్లింగ్ వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు రావడంతో, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో కూడా ఆమె పేరు చేర్చబడింది.

ఈ స్మగ్లింగ్ సిండికేట్ ఒకే ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి హ్యాండ్లర్లు మరియు ఆభరణాల వ్యాపారులు ఈ బంగారాన్ని దేశీయ మార్కెట్లలోకి చొప్పించారని ఈడీ దర్యాప్తు సమయంలో తేలింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో రన్యారావు పేరుతోపాటు, ఆమె సహాయకుడిగా పరిగణించబడుతున్న తరుణ్ కొండూరు, బళ్లారి జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి సాహిల్ జైన్ పేర్లు కూడా చేర్చబడ్డాయి.

దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ గత ఏడాది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన అధికారులు, ఆమె కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తూ, దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారాన్ని తరలించడంలో భారీ కమిషన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఆమెకు ఇప్పటికే ఏడాది జైలు శిక్ష విధించబడిన సంగతి గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story