కొరియన్ కనకరాజు

Korean Kanakaraju: వరుణ్ తేజ్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీకి తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్లలో మరింత పెరుగుదల కనిపించింది. ఆదివారం నాడు సినిమా వసూళ్లు శనివారంతో పోలిస్తే 16.9 శాతం పెరిగినట్లు తాజా బాక్సాఫీస్ రిపోర్టులు వెల్లడించాయి.
మూడో రోజు ముగిసే సమయానికి ‘కొరియన్ కనకరాజు’ ఇండియాలో రూ.13.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.4 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.19.18 కోట్లకు చేరుకున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం కలెక్షన్లకు కలిసొస్తోంది.
వరుణ్ తేజ్‌తో పాటు రితికా నాయక్, సత్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ కథ, దర్శకత్వం అందించారు. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా ముందుకు సాగుతుండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

