నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

Lavanya Tripathi: టాలీవుడ్ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా వేధింపులు మితిమీరిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

లావణ్య తన ఫిర్యాదులో ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఖాతా ద్వారా తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తన నైతిక విలువలను ప్రశ్నించేలా, వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నటుడు వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్య, గతేడాది సెప్టెంబర్ 10న ‘వాయు తేజ్ కొణిదెల’ అనే బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొంత విరామం ఇచ్చిన సమయంలో ఈ వేధింపులు ఎదురుకావడం గమనార్హం. ఈ వేధింపులు ఇప్పుడు అన్ని హద్దులు దాటాయని, అందుకే చట్టపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు, భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story