తన ఇంటిని స్కూల్‌గా మార్చిన స్టార్..

Lawrence’s Big Heart: ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను డ్యాన్స్ మాస్టర్‌గా కష్టపడి సంపాదించి కొనుక్కున్న మొదటి ఇంటిని పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కాంచన 4' సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ మొత్తంతో ఈ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు లారెన్స్ తెలిపారు. "ఈ ఇల్లు నాకు ఎంతో ప్రత్యేకమైనది. డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నప్పుడు నేను దాచుకున్న డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. మొదట దీనిని అనాథ పిల్లల కోసం ఆశ్రమంగా మార్చాను. ఇప్పుడు అదే ఇంటిని పేద పిల్లల చదువు కోసం పాఠశాలగా మారుస్తున్నాను" అని ఆయన తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో మరో గర్వించదగ్గ విషయం ఉందని లారెన్స్ తెలిపారు. తాను పెంచి చదివించిన పిల్లలలో ఒకరు ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా మారి, ఈ పాఠశాలలో తొలి టీచర్‌గా చేరబోతున్నారని చెప్పడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. "సేవే దైవం అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి" అని ఆయన కోరారు.

వృద్ధుడికి లక్ష రూపాయల సాయం

ఇటీవల లారెన్స్ చెన్నై లోకల్ రైళ్లలో స్వీట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల రాఘవేంద్ర అనే వృద్ధుడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఆ వృద్ధుడి వివరాలు తెలిస్తే తెలియజేయాలని, రైళ్లలో కనిపిస్తే స్వీట్లు కొని ఆదుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. లారెన్స్ సేవా గుణంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని అంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story