Actor Dhanush: నటుడు ధనుష్‌కు లీగల్ నోటీసులు.. రూ.20 కోట్లు చెల్లించాలని నిర్మాణ సంస్థ డిమాండ్..
రూ.20 కోట్లు చెల్లించాలని నిర్మాణ సంస్థ డిమాండ్..

Actor Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ చుట్టూ ఇప్పుడు లీగల్ చిక్కులు ముసురుకున్నాయి. సుమారు పదేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒక సినిమా ఒప్పందాన్ని పూర్తి చేయకపోవడంతో, భారీగా నష్టపోయామని పేర్కొంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది.
అసలు వివాదం ఏంటి?
2016వ సంవత్సరంలో ధనుష్, తేనాండాళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో నాన్ రుద్రన్ అనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే మధ్యలో దర్శకుడు మారడం, స్క్రిప్ట్ అందజేయడంలో జాప్యం జరగడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది.
నిర్మాణ సంస్థ ఆరోపణలు:
తమ సినిమాను పూర్తి చేయకుండా ధనుష్ ఇతర చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని నాగార్జున, ఎస్.జే. సూర్య వంటి ప్రముఖ నటులను ఎంపిక చేశామని, వారి కోసం ఇప్పటికే భారీగా ఖర్చులు చేశామని సంస్థ పేర్కొంది. సినిమా ఆలస్యం అవ్వడం వల్ల తమకు సుమారు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని ధనుష్ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
కోలీవుడ్‌లో హాట్ టాపిక్
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్, ఈ లీగల్ నోటీసులపై ఇంకా స్పందించలేదు. ఒకవైపు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా రాణిస్తున్న ధనుష్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వివాదం కోలీవుడ్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

