Senior actress Kasturi Shankar: నాగార్జున అంటే పిచ్చి ప్రేమ.. ఆ అవకాశం వస్తే వదులుకోను - కస్తూరి
ఆ అవకాశం వస్తే వదులుకోను - కస్తూరి

Senior actress Kasturi Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు, సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని కింగ్ నాగార్జునపై తనకున్న విపరీతమైన అభిమానాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా టీనేజ్ రోజుల్లో నాగార్జున అంటే తనకు ఎంత పిచ్చి ప్రేమ ఉండేదో వివరిస్తూ చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కస్తూరి మాట్లాడుతూ.. "నేను చదువుకునే రోజుల్లోనే నాగార్జున గారంటే విపరీతమైన ఇష్టం ఉండేది. ఒకసారి ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. ఆయనతో షేక్‌హ్యాండ్ చేశాను. ఆ షర్ట్ కలర్ కూడా నాకు ఇంకా గుర్తుంది" అని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె చేసిన పనికి యాంకర్ కూడా ఆశ్చర్యపోయారు. "ఆయనతో షేక్‌హ్యాండ్ చేశాక, ఆ చేయిని రెండు రోజుల పాటు కడగలేదు. ఇది నాగార్జున టచ్ చేసిన చేయి అంటూ స్నేహితులకు చూపించి మురిసిపోయేదాన్ని" అని కస్తూరి నవ్వుతూ పంచుకున్నారు.
యంగ్ లుక్, రొమాంటిక్ సీన్
"మా జనరేషన్‌కు ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, ఓ పెద్ద క్రష్. ఇప్పటికీ ఆయనలో ఆ యంగ్ లుక్, చార్మ్ ఏమాత్రం తగ్గలేదు" అంటూ నాగార్జునను కస్తూరి ఆకాశానికెత్తేశారు.
నాగార్జునతో రొమాంటిక్ సీన్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. "అది బెస్ట్ థింగ్. అలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా? ఆయన చాలా ప్రొఫెషనల్, జెంటిల్మెన్. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌కైనా సౌకర్యంగా ఉంటుంది. నేను ఎప్పుడూ సిద్ధమే" అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కస్తూరి చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కింగ్ నాగార్జున మ్యాజిక్ అంటే ఇదే. కస్తూరి ఫ్యాన్ మూమెంట్ అద్భుతం అంటూ నెటిజన్లు, నాగార్జున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.








