సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్‌తో బిజీగా ఉన్న నటి మధు (Madhoo Sha) (రోజా ఫేమ్) తాజాగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన 'చిన్న చిన్న ఆసై', 'గవర్నర్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే అనిల్ కపూర్‌తో కలిసి ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మధు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం.

నటిని కావాలని

"నేను చాలా చిన్న వయసులోనే నటిని కావాలని అనుకున్నాను. మా బంధువు హేమమాలిని షూటింగ్ సెట్స్‌కు వెళ్లడం, ఆమె డాన్స్ ప్రాక్టీస్ చూడడం వల్ల నాకు సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. మా అమ్మ కూడా డాన్స్ టీచర్ కావడంతో మా ఇంట్లో ఎప్పుడూ సంగీతం, నృత్యం వినిపించేవి. అయితే, ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఎలాంటి పక్కా ప్లాన్ చేసుకోలేదు. హీరోయిన్ కాకముందు ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నాను. రిసెప్షనిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించాను. కానీ ఎక్కడా కుదరలేదు. బహుశా నేను నటిని కావాలనేదే భగవంతుడి సంకల్పం కాబోలు, అందుకే ఇక్కడికి వచ్చాను."

పిల్లల కోసమే సినిమాలకు

"పెళ్లి తర్వాత నేను సినిమాలకు స్పష్టమైన బ్రేక్ ఇచ్చాను. నా పిల్లలు పుట్టిన తర్వాత నా ప్రపంచం మొత్తం వారే అయ్యారు. కెరీర్‌ను, మాతృత్వాన్ని ఒకేసారి బ్యాలెన్స్ చేసే మహిళలను నేను గౌరవిస్తాను, కానీ నాకు అలా మల్టీటాస్కింగ్ చేయడం చేతకాదు. నా పిల్లల ప్రతి చిన్న విషయాన్ని (మొదటి అడుగు, మొదటి మాట, మొదటి స్కూల్ డే) నేనే దగ్గరుండి చూడాలనుకున్నాను. అందుకే పదేళ్లపాటు పూర్తిగా వారికే సమయం కేటాయించాను. వారు పెద్దవారై, తమ పనులు తాము చేసుకోగలగడం స్టార్ట్ అయ్యాక నేను మళ్లీ నటన వైపు వచ్చాను."

మనోజ్, ప్రభుదేవా, గోవిందాలతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్..

"'గవర్నర్' సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. ఆయన లాంటి ప్రతిభావంతులతో నటించినప్పుడు మన నటనను కూడా మెరుగుపరుచుకోవాల్సి వస్తుంది. నా కెరీర్‌లో ప్రభుదేవాతో డాన్స్ చేసినా, గోవిందాతో కలిసి నటించినా వారి నైపుణ్యం నన్ను మరింత కష్టపడేలా చేసింది."

"ప్రభుదేవాతో 'మిస్టర్ రోమియో' సినిమా చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. రిహార్సల్స్ సమయంలో నేను డాన్స్ చేస్తుంటే, ప్రభుదేవా తన అసిస్టెంట్లను నాతో ప్రాక్టీస్ చేయించి ఆయన పక్కకు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు కొంచెం అవమానంగా అనిపించింది. ఎందుకంటే నేను మంచి డాన్సర్‌ని అనుకునేదాన్ని. కానీ ఆ పట్టుదలతో మరింత కష్టపడి ప్రాక్టీస్ చేశాను. సాంగ్ రిలీజ్ అయ్యాక ప్రభుదేవాతో సమానంగా డాన్స్ చేశానని అందరూ మెచ్చుకున్నారు. అలాగే గోవిందాతో పనిచేయడం మర్చిపోలేను. ఆయన టైమింగ్, కామెడీ సెన్స్ అద్భుతం. అజయ్ దేవగన్ విషయానికి వస్తే ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు, కానీ సీరియస్ ముఖంతోనే నవ్వించే జోకులు వేస్తారు."

మొదట వద్దు అనుకున్నా..

"'చిన్న చిన్న ఆసై' అనే టైటిల్ నా 'రోజా' సినిమాలోని ఐకానిక్ సాంగ్ నుండి తీసుకున్నారు. దర్శకురాలు ఈ కథతో నన్ను సంప్రదించినప్పుడు డిసెంబర్ నెలలో వారణాసిలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ అన్నారు. అప్పుడు నా పిల్లలకు క్రిస్మస్ సెలవులు ఉండడం వల్ల మొదట నేను ఈ సినిమాను వద్దనుకున్నాను. కానీ ఆ డైరెక్టర్ మొండిగా పట్టుబట్టి, ఈ పాత్ర నాకోసమే రాశానని చెప్పారు. చివరకు ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను."

"ఈ సినిమాలో నా సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ ఇంద్రాన్స్ నటించారు. ఇది వయసు పైబడిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాల కథ. కేవలం పాటలు, ఫైట్లతో కూడిన కమర్షియల్ సినిమా కాదు. ఒక తమిళ మహిళ, ఒక మలయాళీ వ్యక్తి కాశీలో కలుసుకుంటే వారి మధ్య ఏర్పడే బంధమే ఈ చిత్రం. భాషలతో సంబంధం లేకుండా హృదయాలను కదిలించే నిజమైన పాన్-ఇండియా సినిమా ఇది."

అప్పట్లో వివాదం కానివి.. ఇప్పుడు ఎందుకు?

"ఈ మధ్య కాలంలో సినిమాల్లో మహిళల గ్లామర్ ప్రదర్శన, కెమెరా యాంగిల్స్‌పై విమర్శలు రావడం చూస్తున్నాం. ముఖ్యంగా నటీమణుల డాన్స్ నంబర్స్ ట్రోల్ అవుతున్నాయి. అయితే 90వ దశకంలో మేము సినిమాలు చేసినప్పుడు కొన్ని డాన్స్ మూమెంట్స్, కెమెరా యాంగిల్స్ కమర్షియల్ సినిమాల్లో భాగమే అనుకునేవారు. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించారు. కానీ ఇప్పుడు సమాజం మారింది. మహిళల ప్రాతినిధ్యం, సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి. మహిళలు ఇప్పుడు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. సమాజంలో వస్తున్న ఈ మార్పుల వల్లే సినిమాల్లో చూపే విధానాన్ని కూడా ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి పరిణామమే."

గవర్నర్ సినిమా విశేషాలు..

"'గవర్నర్' సినిమాలో నాది కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే అని తెలిసి మొదట వద్దనుకున్నాను. కానీ నిర్మాత ముఖేష్ జీ ఫోన్ చేసి, స్క్రీన్ టైమ్ తక్కువైనా కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. 1990ల నాటి భారతదేశ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక దేశ ఆర్థిక సంక్షోభంలో గవర్నర్ తీసుకునే కీలక నిర్ణయాల వెనుక, ఆయన భార్యతో జరిగే వ్యక్తిగత సంభాషణలు ఎంత ప్రభావం చూపాయనేది ఇందులో అద్భుతంగా చూపించారు. ఇది ఎలాంటి ఎజెండా ఉన్న సినిమా కాదు, దేశం కోసం తెరవెనుక శ్రమించిన ఒక బ్యూరోక్రాట్ కథ" అని నటి మధు చెప్పుకొచ్చారు.

Lipika Varma

Lipika Varma

Next Story